2024 భారతదేశం ఎన్నికలు: ప్ర‌ధాని మోదీ బ‌హుశా స్టేజి మీద‌నే ఏడుస్తారేమో! ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, ఇక రెండో ద‌శ పోలింగ్ పై ప్ర‌ధాని మోదీ ఆస‌క్తిక‌ర ట్వీట్
PM Modi vs Rahul Gandhi (Photo Credits: PTI)

Bijapur, April 26: లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఇప్పటికే రెండు ద‌శ‌ల్లో పోలింగ్ ముగియ‌డంతో విమ‌ర్శ‌ల వాడిని పెంచారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగాల్లో ఎక్క‌డో టెన్ష‌న్ క‌నిపిస్తోంద‌ని, ఆయ‌న గెలిచేందుకు సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా వాడుతారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవలకాలంలో ఎన్నికల ప్రసంగాల్లో నెర్వస్ (Nervous)గా కనిపిస్తున్నారని, కొద్ది రోజుల తర్వాత బహుశా స్టేజిపైనే ఆయన కన్నీళ్లు కార్చే అవకాశం లేకపోలేదని రాహుల్ (Rahul Gandhi) అన్నారు. 24 గంటలూ ప్రజల దృష్టిని మళ్లించేందుకుకే ఆయన ప్రయత్నిస్తుంటారని విసుర్లు విసిరారు. కర్ణాటకలోని బిజాపూర్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి గత పదేళ్లలో పేద ప్రజల సొమ్ములను ఊడలాక్కున్నారని, దేశంలోని 70కోట్ల మంది జనాభా వద్ద ఉన్న ఆస్తికి సమానమైన సంపదను మోదీ కేవలం 22 మంది బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని అన్నారు.

 

అటు ప్ర‌ధాన మంత్రి మాత్రం మిగిలిన ద‌శల ఎన్నిక‌ల ప్ర‌చారాల్లో బిజీగా ఉన్నారు. ఇవాళ ముగిసిన రెండో ద‌శ పోలింగ్ కు సంబంధించి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.రెండో దశ చాలా బాగుందని, ఈసారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిందని 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.''ఫేజ్-2 కూడా చాలా బాగుంది. ఓటు వేసిన దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్డీయేకు లభించిన అసాధారణ మద్దతు విపక్షాలకు మరింత నిరాశకు గురిచేస్తుంది. ఎన్డీయే సుపరిపాలనను ఓటర్లు కోరుకుంటున్నారు. యువకులు, మహిళా ఓటర్లు బలమైన ఎన్డీయే మద్దతును బలపరుస్తున్నారు'' అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఇప్ప‌టికే రెండు ద‌శ‌ల్లో పోలింగ్ పూర్త‌యింది. మూడో ద‌శ పోలింగ్ కోసం కూడా స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. మూడో విడత పోలింగ్ మే 7న జరుగనుంది. చివరి విడత జూన్ 1న జరుగనుండగా, జూన్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.