Srinagar November 04దేశానికి సైన్యం సురక్షా కవచమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో ప్రధాని దీపావళి వేడుకలను జవాన్లతో జరుపుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు. అనంతరం సైనికులనుద్దేశించి మాట్లాడారు.

మారుతున్న ప్రపంచం, యుద్ధ పద్ధతులకు అనుగుణంగా మిలటరీ సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటూ వెళ్లడం తప్పనిసరని అన్నారు. గతంలో రక్షణరంగ కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చేదని, కానీ తమ ప్రభుత్వం దేశీయంగా సామర్థ్యం పెంచుకునే ప్రయత్నాలను మెరుగుపరిచిందని చెప్పారు. ప్రధానిగా తాను ఇక్కడకు రాలేదని, వీరజవాన్ల కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసి దీపావళి వేడుకలో పాల్గొనేందుకు వచ్చానని మోదీ చెప్పడంతో సైనికుల్లో నూతనోత్సాహం తొణికిసలాడింది.

Here's ANI Update

సైనికుల కోసం 130కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకువచ్చానని, తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు. సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకువచ్చాయని కొనియాడారు. ప్రతి దీపావళి సైనికులతోనే జరుపుకుంటున్నానని.. జవాన్ల మధ్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రధాని.

Here's PM Narendra Modi with Soldiers

వీరత్వానికి ఈ ప్రాంతం సజీవ తార్కాణమని, సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారన్నారు మోదీ. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని అభినందించారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్నారు. సైన్యానికి అత్యాధునిక ఆయుధ సామగ్రి సమకూరుస్తున్నామని చెప్పారు. తేజస్‌, అర్జునలాంటి ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆయుధ సంపత్తితో సైనిక శక్తి నిరంతరం బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. ఆయుధాలను సమకూర్చుకోవడంలో స్వయం సంవృద్ధి సాధిస్తున్నామన్న ఆయన, 200కిపైగా అత్యాధునిక ఆయుధాలు స్వయంగా తయారు చేసుకుంటున్నామని చెప్పారు.

PM Narendra Modi with Soldiers

అన్నిరంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని.. ఇప్పటికే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు. సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సైనిక పాఠశాలల్లో బాలికలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, మిలటరీ కాలేజీల్లోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జన్మభూమిని మించిన స్వర్గం లేదని మోదీ అన్నారు. సైన్యం కేవలం కేవలం సరిహద్దుల్లోనే కాపలా కాయడం లేదని, రాష్ట్రాలకు కూడా సైన్యం రక్షణగా నిలుస్తుందన్నారు. అనంతరం సైనికులతో కలిపి ఫొటోలు దిగారు. ఆ తర్వాత జవాన్లకు ప్రధాని స్వీట్లు తినిపించారు.