![](https://test1.latestly.com/wp-content/uploads/2021/09/PM-Narendra-Modi.jpg)
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్‌కు సంబంధించి ఆధారాలు బయటపడుతున్న వేళ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల ప్రణాళికపై సమీక్షించాల్సిందిగా అధికారులను మోదీ ఆదేశించారు. కోవిడ్ పరిస్థితిపై సమావేశంలో ప్రధాని సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉంది..ఏ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో ప్రవేశించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి మోదీ అధికారులతో మాట్లాడారు. కరోనా మహమ్మారి ప్రబలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అది విభిన్న రూపాల్లో విజృంభించిందని అధికారులు ప్రధానికి వివరించినట్లు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.
దేశంలో కోవిడ్ పరిస్థితులు, వాక్సినేషన్ ప్రక్రియపైనా మోదీ సమీక్ష చేశారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అనేక దేశాలు మళ్లీ ఆంక్షలబాట పట్టిన వేళ..మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. అనేక దేశాల్లో ఒమిక్రాన్ ప్రభావం, దాని లక్షణాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు. ఒమిక్రాన్ ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించారు. కొత్త వేరియంట్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. ప్రజలు సైతం అత్యంత జాగరూకత ప్రదర్శించాలని, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విన్నవించారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలని, మార్గదర్శకాలకనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని, అత్యంత ప్రమాదకరంగా గుర్తింపబడిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మోదీ ఆదేశించారు. కొత్త వేరియంట్ ఆవిర్భావానికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు ఉన్నందున అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల విషయంలో సరైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు స్పష్టంచేశారు.
దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దాని పొరుగుదేశాలకు సైతం వ్యాపించింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్ సోకుతుందన్న ఆందోళనలో ప్రపంచదేశాలు ఉన్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్లా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని, వేగంగా వ్యాపించి…తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ…ఈ వేరియంట్‌ను ఆందోళనకరమైనదిగా అభివర్ణించింది. దీనిపై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్ కారణంగా ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలపై ఇప్పటికే అనేక దేశాలు నిషేధాజ్ఞలు విధించాయి.