Janata Curfew: ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అందరూ 'ఇంటికే' పరిమితమవ్వాలని విజ్ఞప్తి, నిత్యావసర వస్తువుల కొరత లేదు, అనవసర కొనుగోళ్లు వద్దని సూచన
PM Modi addressing the nation | (Photo Credits: ANI)

New Delhi, March 20: కరోనావైరస్ మహమ్మారిని (Coronavirus Pandemic)  ఎదుర్కోవటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గురువారం రాత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాబోయే రోజులు పాటించాల్సిన నియమాలను వివరించారు. మార్చి 22 నుండి ప్రతి ఆదివారం దేశం "జనతా కర్ఫ్యూ" (Janata Curfew ) కు కట్టుబడి ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. ఇది జనం కోసం జనం ద్వారా జనమే విధించుకున్న కర్ఫ్యూ అని ప్రధాని పేర్కొన్నారు.

"సామాజిక దూరం" (Social Distance) యొక్క ప్రాముఖ్యతను పిఎం మోదీ నొక్కి చెప్పారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితమవ్వాలని, వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులు "వర్క్ ఫ్రమ్ హోమ్" ద్వారానే విధులు నిర్వహించాలని పీఎం సూచించారు. ప్రైవేట్ రంగాల యాజమాన్యాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహించాలి. ఇందుకోసం ఎవరి వేతనాల్లో కోతపెట్టొద్దు, అలాగే ఈ కరోనాకాలంలో ఎవరైనా ఉద్యోగి పనిచేయలేని పక్షంలో కూడా సాలరీస్ తగ్గించొద్దు, నేను యాజమాన్యాలను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని మోదీ అన్నారు.

జనతా కర్ఫ్యూ

 

"మార్చి 22 న, ఆదివారం ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా 'జనతా కర్ఫ్యూ'ను పాటించాల్సి ఉంటుంది" అని ప్రధానమంత్రి అన్నారు, కరోనావైరస్ వ్యాప్తిని కలిగి ఉండటానికి వారి ఇళ్ళ నుండి బయటికి రాకుండా ప్రజలు స్వయంగా కర్ఫ్యూ విధిస్తారు. కరోనావైరస్ ముప్పు కొనసాగే వరకు ప్రతి ఆదివారం కర్ఫ్యూ విధించబడుతుంది.

జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి:

1. దేశ పౌరులందరూ ఆదివారం (మార్చి 22) న తమ తమ ఇండ్లకే పరిమితమవ్వాలి. రోడ్లపై మరియు బహిరంగ ప్రదేశాలలో ఎవరూ తిరగకూడదు.

2. జనతా కర్ఫ్యూ ప్రతీ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది.

3. పోలీసు, వైద్యం, మీడియా, హోమ్ డెలివరీ, ఫైర్ ఫైటింగ్ మరియు దేశానికి సేవ చేయడం వంటి అత్యవసర సేవల్లో పనిచేసే వారు జనతా కర్ఫ్యూలో పాల్గొనవలసిన అవసరం లేదు. వీరంతా తమకు తాముగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

4. ఈ కరోనావైరస్ కష్టకాలంలో అత్యవసర సేవలలో పనిచేసే వారికి సెల్యూట్ చేస్తూ, ప్రజలు వారి గుమ్మాలలో నిలబడి, చప్పట్లు కొట్టడం, బెల్ రింగ్ చేయడం ద్వారా వారి సేవలకు ఒక గుర్తింపు, గౌరవం ఇవ్వండని ప్రజలను ప్రధానమంత్రి కోరారు.

"గత రెండు నెలలుగా, ఆసుపత్రులు మరియు విమానాశ్రయాలలో లక్షల మంది సిబ్బంది తమను తాము పట్టించుకోకుండా ప్రజల సేవల్లో రాత్రింబవళ్లు పనిచేస్తూ కష్టప్పడుతున్నారు. వీరందరికీ నమస్కరించి మొక్కుతూ మార్చి 22, సాయంత్రం 5 గంటలకు, మన గుమ్మం వద్ద, బాల్కనీలలో, మా కిటికీలలో నిలబడి ఒక ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం మరియు గంటలు మోగించడం వంటివి చేయండి "అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

COVID-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందడం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చిరు వ్యాపారులకు, బడా వ్యాపార సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు కలిగే నష్టాన్ని అధ్యయనం చేయడానికి, ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుంది. COVID-19- ప్రభావిత విభాగాల సమస్యలను పరిష్కరించడానికి టాస్క్ ఫోర్స్ అవసరమైన జోక్యం చేసుకుంటుంది అని మోదీ అన్నారు.

పానిక్ కొనుగోలు అవసరం లేదు

రాబోయే రోజుల్లో ఆహారం మరియు నిత్యావసరాల కొరత ఏం ఉండబోదు. కాబట్టి పుకార్లు నమ్మి ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొంతమంది ఉన్మాదంతో ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు, అవాస్తవాలను నమ్మి ప్రజలు అనవసరమైన కొనుగోళ్లు, నిల్వ చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాము అని  ప్రధానమంత్రి వెల్లడించారు.