pm-Narendra-modi-to-inaugurate-kartarpur-corridor-on-nov-8 (Photo-Twitter)

New Delhi, October 13:  గత కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న పాక్తిస్తాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ ప్రారంభోత్సవంపై ఎట్టకేలకు ఓ నిర్ణయం వెలువడింది. కర్తార్‌పూర్ కారిడార్‌‌ను భారత ప్రధాని మోడీ వచ్చేనెల 8న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ బాదల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ట్విట్టర్లో ఆమె ట్వీట్ చేస్తూ గురునానక్ దేవ్ జీ ఆశీస్సులతో ఎట్టకేలకు కర్తార్‌ పూర్ కారిడార్ ప్రారంభం కానుందని, దీనిని వచ్చే నెల 8న ప్రధాని మోడీ ప్రారంభించడంతో కొత్త చరిత్ర నమోదవుతుందన్నారు. కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం సుల్తాన్‌ పూర్ లోధి వద్ద ప్రధాని మోదీ ప్రార్థనలు చేయనున్నారని చెప్పారు. వచ్చేనెల 11న పంజాబ్‌ లోని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వేదికను హోంమంత్రి అమిత్ షా సందర్శిస్తారని, మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందర్శిస్తారని తెలిపారు.

కేంద్రమంత్రి హర్‌ సిమ్రత్ కౌర్ బాదల్ ట్వీట్

పంజాబ్‌‌లోని గురుదాస్‌ పూర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ మందిరాన్ని పాకిస్థాన్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలుపుతూ కర్తార్‌ పూర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అటు పాకిస్థాన్‌ లో కారిడార్ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. కాగా ర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి తాము భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానిస్తున్నట్లుగా ఇప్పటికే పాకిస్తాన్ తెలిపింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ను సిక్కు వర్గానికి ప్రతినిధిగా భావిస్తున్నామని, ఆయనకు త్వరలోనే ఆహ్వాన పత్రిక పంపిస్తామని తెలిపారు.

పాక్ విదేశాంగ మంత్రి వీడియో

ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో భాగంగా ఉన్న సిక్కుల పవిత్ర స్థలం కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ కు తను వెళ్లే సమస్యే లేదని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ కు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందించిన నేపథ్యంలో అమరీందర్ సింగ్ స్పందించారు. తను కర్తార్ పూర్ కు వెళ్లే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రివ్యూ మీటింగ్

అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ కూడా వెళ్లకపోతేనే మంచిదని అమరీందర్ అన్నారు. ఆ ఆలోచనను మన్మోహన్ మానుకోవాలని అన్నారు. ఈ విషయంలో మన్మోహన్ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా మరో పంజాబ్ నేత శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ దీన్ని రాజకీయం చేయవద్దని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

రాజకీయం చేయవద్దన్న సుఖ్ బీర్ సింగ్ బాదల్ 

దేశవిభజన సమయంలో పంజాబ్ కూడా రెండు ముక్కలుగా విడిపోయింది. భారత్, పాక్ దేశాల్లో పంజాబ్ పేరిట రాష్ట్రాలున్నాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు వెంబడి ఇరుదేశాల్లో సిక్కులకు పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాలు కొలువుదీరాయి. భారత్‌లో డేరా బాబా నాక్ సాహిబ్, పాకిస్థాన్‌లో గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్ పూర్ పేరిట ఈ క్షేత్రాలు ప్రాచుర్యం పొందాయి. భారత్, పాక్ దేశాల్లోని సిక్కులు ఆ పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు వీలుగా కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. సరిహద్దు వెంబడి ఇరుదేశాల్లోనూ దీనికి సంబంధించి గతేడాది శంకుస్థాపనలు జరిగాయి. దీని ద్వారా భారత్ నుంచి వచ్చే సిక్కు భక్తులు ఎలాంటి వీసాలు లేకుండా పాక్ భూభాగంలోని గురుద్వారా క్షేత్రాన్ని సందర్శించే సౌలభ్యం కలగనుంది.

ఇంకా తేదీని ప్రకటించని పాకిస్తాన్ 

సిక్కు మత వ్యవస్థాపకుడైన డేరా బాబా గురు నానక్ దేవ్ 1469 నవంబర్ 29న పంజాబ్‌లో జన్మించారు. 1539 సెప్టెంబర్ 22న ఆయన మరణించారు.ఆయన పుట్టిన, మరణించిన స్థలాలు రెండు ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్ కనా సాహిబ్‌లో ఉంది. అక్కడ ఉన్న గురుద్వారాను గురుద్వారా జనమ్ ఆస్థాన్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్ చివరిరోజులను కర్తార్ పూర్‌లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. అయితే ఆయన సమాధి చుట్టే గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను నిర్మించారు. ఇది లాహోర్‌కు 120కిలోమీటర్ల దూరంలో నరోవల్ జిల్లాలో ఉంది.

ప్రధానిని ఆహ్వానిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి

గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తాపూర్ పాక్‌లోనే ఉన్నప్పటికీ భారతదేశ సరిహద్దుకు కేవలం 3కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్థాన్ వెళ్లి గురుద్వారాను దర్శించుకోలేని సిక్కులు భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం గురుదాస్ పూర్ జిల్లా మన్ గ్రామం దగ్గర ఇంటర్నేషనల్ బోర్డర్ లో నిలబడి బైనాక్యులర్ ద్వారా గురుద్వారాను దర్శించుకుని దండం పెట్టుకుంటారు.