Meghalaya November 25: మేఘాలయా కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ సీఎం సహా రాత్రికి రాత్రే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన మద్దతుదారులైన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డోకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పటికే లేఖ రాశారు.
కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ ప్రకటించింది. దీంతో మేఘాలయా అసెంబ్లీలో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న టీఎంసీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నది.
మేఘాలయా అసెంబ్లీకి 2023లో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే దిశగా టీఎంసీ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉన్న ముకుల్ సంగ్మా.. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు విన్సెంట్ హెచ్ పాలాతో ఆయనకు పొసగడం లేదు. అయితే పార్టీ పెద్దల సూచనతో ఇద్దరు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే సంగ్మా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.