Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ ను విభచించిన మోడీ సర్కార్. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన, క్షణాల్లో రాష్ట్రపతి ఆమోదం మరియు గెజిట్ విడుదల. కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్తత.
Amit Shah Makes Historic Announcement over Jammu Kashmir in Parliament.

ఆగష్టు 5, 2019 సోమవారం, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే కాశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును హోంమంత్రి ప్రవేశ పెట్టబోతున్నట్లుగా భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వెల్లడించారు. దీంతో సభలో సభ్యుల గందరగోళం మెల్లిగా మొదలైంది. ఎప్పుడైతే హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35ఎ రద్దును ప్రతిపాదించారో ఒక్కసారిగా సభ అగ్నిపర్వతం బద్దలైనట్లుగా సభ్యులందరూ లేచి తీవ్రంగా స్పందించారు. స్పీకర్ పోడియం వైపుకు దూసుకుపోయారు. సభలో ఏం జరుగుతుందో తెలియనంతగా కల్లోలం మొదలైంది. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేశారు.

అందరూ అనుకుంటున్నట్లుగానే మోడీ సర్కార్ దేనిని లెక్కచేయకుండా కాశ్మీర్ అంశంలో ఏదైతే అది జరగని అన్నట్లుగా డేరింగ్ గా ముందడుగు వేసింది. దీనికోసం కొన్ని రోజుల ముందు నుంచే సంకేతాలు ఇస్తూ వెళ్లింది. భారీగా భద్రతాదళాలను జమ్మూ-కాశ్మీర్ తరలించింది. కాశ్మీర్ లో పర్యటించే యాత్రికులను వెనక్కి పంపించేసింది. కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరియు కాశ్మీర్ కు చెందిన ఇతర ముఖ్యనాయకులను బయటకు రాకుండా గృహ నిర్భంధం చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై-అలర్ట్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూ-కాశ్మీర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా అప్రపమత్తం కావడంతో కాశ్మీర్ విషయంలో మోడీ సర్కార్ ఏదైనా కీలక ప్రకటన చేయబోతుందని అందరూ భావించారు. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే దిశగా మోడీ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోబోతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు.

అందుకుతగినట్లుగానే, ఎలాంటి నాన్చుడు ధోరణి లేకుండా మోడీ ప్రభుత్వం కశ్మీర్ 'స్పెషల్ స్టేటస్'ను రద్దును ప్రతిపాదించింది. దానితో పాటు జమ్మూకాశ్మీర్ పునర్విభజన చేస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టింది. సభలో అమిత్ షా ఈ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగానే మరోవైపు నుంచి రాష్ట్రపతి వాటికి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.