Karnataka New CM Basavaraj Bommai | PTI Photo

Bengaluru, July 27: కర్ణాటక రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ ఎస్ బొమ్మాయి ఎన్నికయ్యారు. మంగళవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటెల్ లో జరిగిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభాపక్ష సమావేశంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మాయినే తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఈ సమావేశంలో బిజేపి నుంచి మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు హాజరవగా, కేంద్ర మంత్రులు జి. కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌లను కేంద్ర పరిశీలకులుగా వ్యవహరించారు.

ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిన అనంతరం బసవరాజ్ ఎస్ బొమ్మాయిను ముఖ్యమంత్రిగా ఖరారు చేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

బసవరాజ్ బొమ్మాయి ప్రస్తుతం యడ్యూరప్ప ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈయన తాజాగా రాజీనామా చేసిన యడ్యూరప్పకు సన్నిహితుడు మరియు యడ్యూరప్ప మాదిరిగానే, రాష్ట్రంలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు. బసవరాజ్ తండ్రి ఎస్.ఆర్. బొమ్మాయి కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

రాజకీయాల్లోకి రాకముందు వృత్తిరీత్యా ఇంజనీర్ మరియు టాటా గ్రూపు కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్న బసవరాజ్ బసవరాజ్ బొమ్మాయి 2008లో బిజెపిలో చేరారు, హవేరి జిల్లాలోని షిగ్గావ్ నుండి రెండుసార్లు ఎమ్మెల్సీ మరియు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ క్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు.

Here's the update:

కర్ణాటకలో బీజేపీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత సోమవారం రోజే నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం  గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించగా, గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. తాను స్వచ్ఛందంగానే సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా తన తర్వాత కొత్త సీఎంగా అధిష్టానం ఎవర్ని ఖరారు చేసిన పూర్తిగా సహకరిస్తానని, వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీని రాష్ట్రంలో మరలా అధికారంలోకి తేవడానికి తోడ్పడతానని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే, బసవరాజ్ బొమ్మాయిని సీఎంగా ఎంపిక చేయడం పట్ల పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. లింగాయత్ వర్గానికి చెందని ఎమ్మెల్యేలు ఈ ఎంపిక పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీసారి భాజపా అధిష్టానం లింగాయత్ సామాజిక వర్గం నుంచే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది. రాష్ట్రంలో ఇక ముందైనా ఇతర సామాజిక వర్గాలు ఎదగాల్సిన అవసరం వచ్చిందని వారు అన్నట్లు సమాచారం.