Bhopal, March 20: మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏర్పాటైన 15 నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలలోపు ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎలాంటి బల నిరూపణ చేసుకోకుండానే కమల్ నాథ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తన ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేకపోవడంతో గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ "అత్యాశపరులైన తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడుపోయారని" చెప్పారు. ప్రజలు తమకు 5 ఏళ్లు అవకాశం ఇచ్చారు, అయితే తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీజేపీ కుట్రలు పన్నుతూ వచ్చిందని ఆయన విమర్శించారు. ఏదిఏమైనా ఈ 15 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాము, రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గించడానికి యువ స్వాభిమన్ యోజనను ప్రారంభించాము, 20 లక్షల మంది రైతు రుణాలను మాఫీ చేశాం, ఆవులకు ఆశ్రయాలు ఏర్పాటు చేశాము, శ్రీలంకలో సీత కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాము. ఈ అభివృద్ధి పనులన్నీ బీజేపీని కలవర పరిచాయని కమల్ నాథ్ అన్నారు.
Kamal Nath Tenders Resignation From Madhya Pradesh CM Post:
#WATCH I have decided to tender my resignation to the Governor today: #MadhyaPradesh CM Kamal Nath pic.twitter.com/DlynuxzGtO
— ANI (@ANI) March 20, 2020
గత కొంతకాలంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధిష్ఠానం తనకు సీఎం పదవి కేటాయించకపోవడంతో అలకబూనిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల బీజేపీలో చేరారు. సింధియా రాజీనామాతో ఆయన విధేయులైన 22 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి తమ మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి, కనిపించకుండా పోయారు. ఆ తర్వాత బెంగళూరులోని ఒక రిసార్టులో ప్రత్యక్షమై తన సీఎంపై నిప్పులు చెరిగారు. వీరంతా ఈమెయిల్ ద్వారా తమ రాజీనామాను స్పీకర్ కు పంపించడంతో స్పీకర్ ఆ రాజీనామాలను ఆమోదించారు. బీజీపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని మోదీపై ప్రశంసలు
మధ్య ప్రదేశ్ శాసనసభలో 230 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా, అందులో 24 ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందడంతో. ప్రస్తుతం 206 సభ్యులతో అసెంబ్లీ కొనసాగుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే ఎమ్మెల్యేల సంఖ్య 104. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం 114, బీజేపీకి ఉన్న బలం 107 అయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ బలం సభలో 92కు పడిపోయింది. దీంతో ఇప్పుడు బీజేపీ 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
దీంతో మరో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్లయింది. ఇప్పటికే గోవా, సిక్కిం, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పోగొట్టుకొని బీజేపీ చేతుల్లో పెట్టిన విషయం తెలిసిందే.