New Delhi, February 11: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మూడోసారి దిల్లీ సీఎం అవుతూ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. దిల్లీలో 70 స్థానాలకు గానూ మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు వచ్చిన ఫలితాల (Delhi Assembly Elections 2020 Results) ప్రకారం ఆప్ (AAP) 56 స్థానాల్లో దూసుకుపోతుండగా, భాజపా (BJP) 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది.
అభివృద్ధి, సంక్షేమం పేరుతో అర్వింద్ కేజ్రీవాల్ చేసిన ప్రచారానికే ప్రజలు పట్టం కట్టారు. ఇక పూర్తిగా జాతీయవాదానే నమ్ముకున్న భారతీయ జనతా పార్టీని దిల్లీ ఓటర్లు తిరస్కరించారు. అయితే గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ, 2020 ఎన్నికలకు వచ్చేసరికి 15 స్థానాల వరకు గెలుచుకుంటుడంతో మంచి పురోగతి సాధించినట్లయింది. కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గతంలో వరుసగా మూడు సార్లు దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా ఆక్రమించేసింది. ఆప్ రాకతో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేకపోతుంది. అయితే బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కావాలనే ఈ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఆప్ అభ్యర్థులకు పోటీగా బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని ఒక ఆరోపణ రాజకీయ వర్గాల్లో ఉంది.
అందరూ అనుకున్నట్లుగానే ఈసారి ఎన్నికల్లో ఆప్- బీజేపీ మధ్యే పోటీ జరిగింది. ప్రచారంలో కూడా ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. వేరే పార్టీల ఊసే రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి - దిల్లీ ప్రభుత్వానికి జరుగుతున్న వార్ లాగా ఈ ఎన్నికలు తలపించాయి. ఒక బీజేపీ నేత అయితే ఏకంగా పాకిస్థాన్ కు ఇండియాకు మధ్య జరిగే మ్యాచ్, ఎవరిని గెలిపించాలో తేల్చుకోండి అంటూ ఓటర్లకు సవాల్ చేశారు. అయితే అమిత్ షా టీమ్ ఎన్నిఎత్తుగడలు వేసినా, కేజ్రీవాల్ పాపులారిటీ, దిల్లీ ఓటర్ల ఆలోచనా విధానంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఓటర్లు బీజేపీకి పట్టం కడుతున్నా, రాష్ట్రస్థాయిలో తిరస్కరిస్తూ తమ విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. తమకు అందుబాటులో ఉండే నేతలనే ప్రాంతీయంగా గెలిపించుకుంటున్నారు.
ఇక దిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నా, మంచి ఫలితాలను సాధించామని చెప్పుకుంటున్నారు. దీంతో ఆప్ గెలిచిందని సంకేతాలు ఇస్తూనే, తామేమి ఓడిపోలేదు, ధీటుగా నిలబడ్డాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.