New Delhi, February 11: దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. ఉదయం 10:45 వరకు వచ్చిన ఫలితాలను (Delhi Assembly Elections 2020 Results) చూస్తే అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మెజారిటీ స్థానాల్లో లీడింగ్ లో ఉంది. 70 సీట్లున్న దిల్లీ అసెంబ్లీలో 52 స్థానాల్లో ఆప్ (AAP) దూసుకుపోతుండగా, బీజేపీ (BJP) 18 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది.
అయితే కొన్ని చోట్ల ఫలితాల ట్రెడ్ రౌండ్ రౌండ్ కి మారుతుంది. 27 స్థానాల్లో ఆప్- బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంది. ఇద్దరికీ కేవలం 1000 ఓట్ల తేడా మాత్రమే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆప్ మెజారిటీ స్థానాల్లో లీడింగ్ లో ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత తాము పుంజుకుంటాం అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. సిటీ ఓటర్లు కొంచెం ఆలస్యంగా ఓటు వేస్తారు కాబట్టి మధ్యాహ్నం 3 గంటల తర్వాత బీజేపీ లీడింగ్ లోకి వస్తుందని కమల దళ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక గతంలో దిల్లీ పీఠంపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు కనీసం ఖాతా తెరిచే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
న్యూదిల్లీ స్థానం నుంచి బరిలో దిగిన ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ లీడింగ్ లో కొనసాగుతున్నారు, ప్రతాప్ గంజ్ నుంచి బరిలో దిగిన మనీశ్ సిసోడియా కూడా లీడింగ్ లో కొనసాగుతున్నారు.
దిల్లీలో ఫిబ్రవరి 8, శనివారం పోలింగ్ జరిగింది, మొత్తం 62.59 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం సహా, పలు అంశాల్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్ కేజ్రీవాల్ ను, ఆమ్ ఆద్మీ పార్టీని దిల్లీలో ఎలాగైనా ఓడించాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. దిల్లీలోని షాహిన్ బాగ్ చుట్టూ రాజకీయాలు నడిచాయి. సిఎఎను వ్యతిరేకిస్తూ దేశ వ్యతిరేక నినాదాలు చేసేవారికి మద్ధతిస్తున్న అర్వింద్ కేజ్రీవాల్ ఒక టెర్రరిస్ట్ అంటూ ప్రచారంలో బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. అందుకు కౌంటర్ గా, నేను టెర్రరిస్ట్ అని మీరు (ప్రజలు) భావిస్తే బీజేపీకే ఓటేయండి అంటూ కేజ్రీవాల్ కౌంటర్ ఎటాక్ చేస్తూ పోయారు. నన్ను ఒక్కడ్ని ఓడించేందుకు బీజేపీ ఎన్నో పార్టీలను వ్యూహాత్మకంగా బరిలోకి దించింది అని కేజ్రీవాల్ ఆరోపించారు.