New Delhi, February 26: అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి, ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎలక్షన్ కమీషన్ స్పష్టం చేసింది.
అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, కేరళలో 140, తమిళనాడులో 234, మరియు పశ్చిమ బెంగాల్‌లో 294 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ వారం ప్రారంభంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వి నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గకపోవటంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించబడింది. ఈ క్రమంలో పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాలతో పాటే పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఈసీ నిర్ణయించింది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో అన్ని నియోజకవర్గాలకు కలిపి ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. వీటి కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి మే 2న జరుగనుంది.
అస్సాం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
మొదటి విడతలో 37 నియోజకవర్గాలకు మార్చి 27న
రెండో విడతలో 47 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1న
మూడో విడతలో 40 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 2న ఫలితాల వెల్లడి.
ఇక పశ్చిమ బెంగాల్ ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది.
ఫేజ్ 1 పోలింగ్ 30 సీట్లకు మార్చి 27న
ఫేజ్ 2 పోలింగ్ 30 సీట్లకు ఏప్రిల్ 1న
ఫేజ్ 3 పోలింగ్ 31 సీట్లకు ఏప్రిల్ 6న
ఫేజ్ 4 పోలింగ్ 44 సీట్లకు ఏప్రిల్ 10న
ఫేజ్ 5 పోలింగ్ 45 సీట్లకు ఏప్రిల్ 17న
ఫేజ్ 6 పోలింగ్ 43 సీట్లకు ఏప్రిల్ 22న
ఫేజ్ 7 పోలింగ్ 36 సీట్లకు ఏప్రిల్ 26 న
ఫేజ్ 8 పోలింగ్ 35 సీట్లకు ఏప్రిల్ 29న నిర్వహించనున్నారు. మే 2న ఫలితాల వెల్లడి.
వీటితో పాటు దేశంలోని 16 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 34 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే వీటికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఈసారి పుదుచ్చేరిలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్ పార్టీతో పాటు, ద్రావిడ మున్నేట కజగం (డిఎంకె), అఖిల భారత ద్రావిడ మున్నేట కజగం (ఎఐఎడిఎంకె) మరియు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.
తమిళనాడులో అధికార ఎఐఎడిఎంకె మరియు బిజెపి చేతులు కలిపగా, ప్రతిపక్ష పార్టీ అయిన డిఎంకె మరోసారి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి మరియు బిజెపి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా అనిపిస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మమతను ఓడించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.