Ayodhya Dispute: మసీదు నిర్మాణం కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ భూమి, విరాళాలు అంగీకరించం. న్యాయపరమైన హక్కుల కోసం పోరాడతాం: జమియత్ ఉలామా-ఇ-హింద్
Ayodhya land dispute case. | (Photo-PTI)

New Delhi, November 15: అత్యంత సున్నితమైన అయోధ్య రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం (Ayodhya Dispute) కేసులో సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రత్యామ్నాయ ఐదు ఎకరాల భూమిని అంగీకరించకూడదని ప్రముఖ ముస్లిం మత సంస్థ జమియత్ ఉలామా-ఇ-హింద్ (JUH- Jamiat Ulema-e-Hind) నిర్ణయించింది. అయోధ్యలోని మసీదు నిర్మాణం కోసం వేరే చోట భూమి లేదా పరిహారం లాంటి 'ప్రత్యామ్నాయం' ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ముస్లిం కమిటీ స్పష్టం చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించింది.

సుప్రీం తీర్పు నేపథ్యంలో JUH కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్షద్ మదానీ (Arshad Madani) నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో భాగంగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ప్రత్యామ్నాయంగా సుప్రీం సూచించిన 5 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. రెండు- ఆ తీర్పును పున:సమీక్ష కోసం సాధ్యమైన ప్రయత్నాలు చేయాలి.

"ఆ చోటులో మసీదు నిర్మాణం మినహా అందుకు ప్రత్యామ్నాయం ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు. ఏ ముస్లిం వర్గానికి కూడా 'బదులు' అనేది సమ్మతం కాదు". అని జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రెసిడెంట్ అర్షద్ మదానీ వ్యాఖ్యానించారు.

సమావేశంలో తీర్మానించిన ఈ కీలక నిర్ణయాలను JUH కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు సుప్రీం తీర్పును సమీక్షించే విషయంలో ముస్లిం పక్షాల తరఫున వాదించే ఓ సీనియర్ న్యాయవాది వద్ద న్యాయపరమైన సలహాలను కోరినట్లు సమాచారం.

నవంబర్ 9న జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్ట్ ధర్మాసనం, దశాబ్దాల తరబడి వివాదాస్పంగా కొనసాగిన అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలం పూర్తిగా హిందూ పక్షాలకే చెందుతుందని స్పష్టమైన తీర్పును వెలువరించింది. అందుకు ప్రత్యామ్నాయంగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్య పట్టణంలోనే మరో చోట మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలం ప్రభుత్వమే కేటాయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.