Janasena Party Chief Pawan Kalyan while addressing Amaravathi people. | Photo- FB

Amaravathi, August 31: రాజధాని తరలిపోతుంది అనే ఊహగానాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా అక్కడి ప్రజలను, రైతులను మరియు ఇతర ప్రజాపక్షాలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఒక ముఖాముఖి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే తాను బలంగా ఢీకొడతానని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

" మద్రాసు నుంచి విడిపోతే కర్నూల్ లో రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం, ఆ తరువాత హైదరాబాదు వెళ్తే అక్కడ తన్నితరిమేసిన పరిస్థితి. అలాంటి అవమానకర పరిస్థితుల్లో నవ్యాంధ్ర ప్రదేశ్ కంటూ ఒక రాజధాని ఉండాలని ఇక్కడి రైతులు వారి భూములను ప్రభుత్వానికి ఇచ్చారు, దళీతులు వారి అసైన్డ్ భూములు సైతం అందించారు. దాదాపు 24వేల మంది రైతులు, తమ 34 వేల ఎకరాలను ప్రభుత్వానికి అందజేశారు. ఇక్కడ వారి భూములను కౌలు కోసం ఇవ్వలేదు. రాజధాని కోసం ఇచ్చారు, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చారు. అలాంటి అమరావతిని ఎవరి మీదో కోపంతో, మీ రాజకీయాల కోసం ఎలా తరలిస్తారు?" అని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఏవైనా అవకతవకలు జరిగితే వాటిని సరిదిద్దాలి కానీ, ఇక్కడ రాజధానినే మారుస్తాం అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు.

కాలం ఘనతో, ఈవీఎంల ఘనతో తెలియదు కానీ 151 సీట్లు గెలిచిన జగన్ సర్కార్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వాన్ని నడపటం అంటే చిన్నపిల్లల ఆటకాదని పవన్ వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నించీ దేనిని కూల్చుదాం, దేనిని ధ్వంసం చేద్దాం అనే ఆలోచిస్తుంది. అమరావతిలో నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు ఇచ్చింది. కానీ అమరావతి విధ్వంసం కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బు ఇవ్వలేదని తెలియజేశారు.

అధికారంతో విధ్వంసక పాలన చేస్తే, ఏదో రోజు ఈ ప్రభుత్వం అధ:పాతాళానికి పడిపోతుందని జోస్యం చెప్పారు. అధికారం ఎప్పుడు ఒకరి పంచనే చేరదని, అది మారుతూ ఉంటుందని పవన్ అన్నారు. ఏపిని విడగొట్టిన పాపానికి చిదంబరం పరిస్థితి ఇప్పుడు ఎలా తయారయ్యిందో తెలుసుకోవాలి. కాలం ఎవరిని వదిలిపెట్టదు, వారు చేసిన పాపానికి మరో రూపంలో వారికి శిక్ష వేస్తుందనడానికి ఇదే నిదర్శనం అని జనసేనాని త్. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా వ్యవహరిస్తే రేపేదైనా జరగొచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఏంటని జగన్ సర్కార్ ను, మంత్రులను పవన్ హెచ్చరించారు. ఇసుక పాలసీల విధానంలో ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి. భూమాతతో ఆటలాడొద్దు, ప్రజలకు కన్నీళ్లు పెట్టించొద్దు. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వాలు ఎప్పుడు నిలబడవు అని జగన్ సర్కారుకు పవన్ హితవు పలికారు.

బీజీపీ పెద్దలతో టచ్ లో ఉన్నా..!

జగన్మోహన్ రెడ్డి అమరావతిని తరలించడం అంటే నరేంద్ర మోదీ, అమిత్ షాలను వ్యతిరేకించడమే అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అమరావతి ఎక్కడికి వెళ్లదు, వెళ్లనివ్వను" అని ఒకవైపు జగన్ సర్కార్ కు వార్నింగ్ ఇస్తూ, ఒకవేళ జగన్ మొండిగా వ్యవహరిస్తే ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాలను కలుస్తా అని హెచ్చరించారు. తనకు బీజేపీ పెద్దలతో ఆత్మీయ బంధం ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఇదివరకు వారిని ఎప్పుడూ ఏది అడగలేదని, కానీ జగన్ మాట వినకపోతే అమరావతి కోసం అడుగుతానని పవన్ పేర్కొన్నారు.