Devendra Fadnavis Back As Chief Minister With Support From NCP Ajit Pawar (Photo-ANI)

Mumbai, November 23: గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలకు ఎండింగ్ కార్డు పడింది. అక్కడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాత్రికి రాత్రే పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ (BJP)నుంచి విబేధాలతో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న శివసేన(Shiv Sena)కు ఎన్సీపీ (NCP) భారీ షాకిచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో జట్టు కట్టిన బీజేపీ ఆగమేఘాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం (Devendra Fadnavis sworn-in as Maha CM) చేశారు.

ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి(Ajit Pawar as Dy CM) గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన కాసేపటికే ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర భవిష్యత్తు కోసం వారు కష్టపడి పనిచేస్తారని నమ్ముతున్నట్టు పేర్కొంటూ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ప్రభుత్వ ఏర్పాటు అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Maharashtra chief minister) మాట్లాడుతూ.. ప్రజలు బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, కిచిడీ ప్రభుత్వాన్ని కాదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (

NCP's Ajit Pawar) మాట్లాడుతూ.. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీతో చేతులు కలిపినట్టు చెప్పారు.

రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు మెజారిటీ ఇచ్చారని, ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన మాట తప్పిందని ఆరోపించారు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శివసేన ప్రయత్నించడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చిందన్నారు.

మీడియాతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ 

ఎన్సీపీతో కలిసి సుస్థిర పాలన అందిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుస్థిర పాలన ఏర్పాటుకు తమతో కలిసి వచ్చిన అజిత్‌ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరికొంత మంది నాయకులు కూడ తమతో చేతులు కలపడంతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగామని ఫడ్నవీస్‌ వెల్లడించారు.

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ 

రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికే బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. రైతులతో సహా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఏర్పాటైతేనే ఈ సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో బీజేపీతో చేతులు కలిపామ’ని అజిత్‌ పవార్‌ వివరించారు.