
Mumbai, February 28: మహారాష్ట్రలో (Maharashtra) విద్యా సీజన్ ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ( Maha Vikas Aghadi) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ముస్లింలకు విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ (Muslim Reservation) కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik) తెలిపారు.
దీనికి సంబంధించిన చట్టాన్ని కూడా తయారు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. స్కూళ్ల అడ్మిషన్ల సమయంలో ఈ రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. ఒకవేళ నియమాన్ని ఉల్లంఘిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెడుతామని మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం తెలిపారు. ఉద్యోగాల్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆలోచిస్తున్నామని, దానికి సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు.
కోర్టు ఉత్తర్వుల వల్ల గత ప్రభుత్వం ఉద్యోగ రిజర్వేషన్లపై వెనకడుగు వేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా, బీజేపీ-శివసేన మధ్య ప్రభుత్వ ఏర్పాటు చెడటంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.