Kolkata, Feb 02: తృణమూల్ కాంగ్రెస్ ఛైర్ పర్సన్ (TMC chairperson) గా సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్ (Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) సంస్థాగత ఎన్నికలు ఐదేళ్ల తర్వాత జరగ్గా.. పార్టీ ఛైర్‌పర్సన్‌గా దీదీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆ పార్టీ సెక్రటరీ జనరల్ పార్థ ఛటర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి విడిపోయాక 1998లో తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించి అప్పట్నుంచి పార్టీకి ఆమె సారథ్యం వహిస్తున్నారు.
2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతం కాలేకపోయినప్పటికీ అప్పట్లో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించడంలో మాత్రం దీదీ (Didi) సఫలీకృతమయ్యారు. ఆ తర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దెదించి తొలిసారి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ (Mamata Banerjee).. అప్పట్నుంచి తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ (BJP)తో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన రసవత్తర పోరులో 294 సీట్లకు గాను ఏకంగా 213 సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు.
West Bengal CM Mamata Banerjee re-elected as TMC Chairperson unopposed pic.twitter.com/flTRj3V8j1
— ANI (@ANI) February 2, 2022
మరోవైపు 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) నుంచి కూడా బరిలోకి దిగుతుందని మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు ఒక్కటవుదామంటూ అన్ని ప్రాంతీయ పార్టీలకువిజ్ఞప్తి చేశారు. దాదాపు ఏడెనిమిది మంది బీజేపీ నేతలు తమ పార్టీలో చేరాలనుకుంటున్నారన్నారు. అలాగే, నిన్న కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్మికులు, రైతులు, సామాన్యులకు ఏమీలేవని విమర్శించారు. తమ రాష్ట్రంలో బీజేపీకు దళారులు ఉన్నారనీ.. పెగాసస్ (Pegasus) కన్నా ప్రమాదకరమంటూ గవర్నర్‌ను ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో దీదీ విరుచుకుపడ్డారు.