Agarthala, May 15: త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా(Tripura New CM) మాణిక్ సాహా (Manik saha) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్‌ఎన్ ఆర్య.. మాణిక్ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొన్నటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బిప్లక్ కుమార్ దేవ్ (Biplab Deb Kumar) రాజీనామా చేయడంతో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మాణిక్ సాహాకు సీఎం పదవి వరించిన సంగతి తెలిసిందే. వృత్తిరీత్యా దంత వైద్యుడైన 69 ఏళ్ల సాహా 2016లో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. 2020 నుంచి బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ శ్రేణులు ఆయనకు గౌరవం ఇస్తాయి.
Agartala | Manik Saha takes oath as the Chief Minister of Tripura pic.twitter.com/Tdpg8XxLiu
— ANI (@ANI) May 15, 2022
తాజాగా బిప్లవ్ దేవ్ రాజీనామా చేయడంతో సాహాను పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొన్ని సంవత్సరాల్లోనే పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అటు కొత్త సీఎం మాణిక్ సాహాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు.
ఇదిలాఉంటే, 2018 త్రిపురలో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన బిప్లవ్ దేవ్.. అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు జాతీయస్థాయిలో వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉండేదని ఒకసారి వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో 1997లో మిస్ వరల్డ్ టైటిల్.. డయానా హేడెన్‌కు దక్కడాన్ని ప్రశ్నించారు. ఐశ్వర్యారాయ్ భారత్ అందానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటనలు దేవ్ పదవికి ముప్పు తెచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఢిల్లీ వెళ్లి కలిసి వచ్చిన మరుసటి రోజే గవర్నర్ ఎస్.ఎన్.ఆర్యకు దేవ్ రాజీనామా సమర్పించడం గమనార్హం