Navjot Singh Sidhu (Photo Credits: IANS/File)

Chandigarh November 05: పంజాబ్‌ పీసీసీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ. అయితే కాంగ్రెస్‌కు ఒక కండీషన్ పెట్టారు. పంజాబ్‌కు కొత్త అడ్వకేట్ జనరల్‌ను నియమించిన రోజే తాను కాంగ్రెస్ ఆఫీస్‌లో అడుగుపెట్టి, బాధ్యతలు స్వీకరిస్తానని అల్టిమేటం జారీ చేశారు.

వ్యక్తిగత ఇగోతో తన రాజీనామా నిర్ణయం తీసుకోలేదన్నారు సిద్ధూ. పంజాబీల ప్రయోజనాల కోసమే అలా చేశానన్నారు. సీఎం చరణ్‌జిత్‌ చన్నీతో తనకు ఎలాంటి విభేదాల్లేవని స్పష్టంచేశారు. తానేం చేసినా పంజాబ్‌ రాష్ట్రం కోసమే చేస్తానని, పంజాబ్‌ తన ఆత్మ అన్నారు. గత నాలుగున్నరేళ్లుగా మద్యం, బస్సులు సహా అనేక అంశాలను లేవనెత్తానన్నారు. గతంలో సీఎంగా ఉన్న అమరీందర్‌ సింగ్‌ అధికారులను తన చేతుల్లో పెట్టుకొని పనిచేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని, పంజాబీల హక్కుల కోసం మాత్రమే తాను పోరాడతానన్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో 80 నుంచి 100 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ప్రస్తుతం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సీనియర్ న్యాయవాది ఏపీఎస్‌ డియోల్‌ నియామకాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2015లో అప్పటి అకాలీదళ్‌ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై కాల్పులు, మతపరమైన ఘటనలకు సంబంధించిన కేసుల్లో నిందితులైన మాజీ డీజీపీ సుమేధ్‌ సైనీ, మరో పోలీసు అధికారి తరఫున వాదించిన డియోల్‌ని ఏజీగా నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ప్రస్తుతం డీజీపీగా ఉన్న సహోతాను కూడా తప్పించాలని సిద్ధూ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తనపై సిద్ధూ విమర్శల నేపథ్యంలో డియోల్‌ తన ఏజీ పదవికి రాజీనామా చేస్తూ సీఎంకు సోమవారం లేఖ అందించారు. కానీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఏజీ రాజీనామాను సీఎం చరణ్‌జిత్‌ చన్నీ తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.