
Mumbai, November 27: సీన్ 1: నాలుగు రోజుల క్రితం, తేదీ నవంబర్ 23, ఈరోజు శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనుకున్న తరుణంలో, రాత్రికిరాత్రే జరిగిన అనూహ్య పరిణామాలతో బీజేపీ నుంచి దేవేంద్ర ఫడణవిస్ (Devendra Fadnavis) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించారు. మూడు పార్టీల కిచిడీ ప్రభుత్వం వద్దు, సుస్థిరమైన బీజేపీ- ఎన్సీపీ ప్రభుత్వం ముద్దు అంటూ ముద్దుముద్దుగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ వార్త ఉదయాన్నే ఎంతో మందికి షాక్ తో కూడిన విస్మయాన్ని కలిగించింది. వెంటవెంటనే ప్రధాని, సహా కేంద్ర మంత్రులు ఫడణవిస్ కు శుభాకాంక్షలు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడుతూ.. 'రాజకీయాల్లో, క్రికెట్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చు' అని వ్యాఖ్యానించారు.
సీన్ 2: కథలో సుప్రీంకోర్ట్ ఎంట్రీ, సీఎం ఫడణవిస్ వెంటనే నవంబర్ 27 సాయంత్రం 5 లోపే సంఖ్యాబలం నిరూపించుకోవాలని ఆదేశం, 'మహా' రాజకీయాల్లో వచ్చిన ఈ 'సుప్రీం' ట్విస్టుకు డీలా పడిన ఫడణవిస్ సీఎం పదవికి రాజీనామా చేసేశారు.
ఇక ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ (Nawab Malik) ఎంటరై, గడ్కరీ సాబ్ ఈ ట్విస్ట్ ఎలా ఉంది? 80 గంటల్లోనే మీ ప్రభుత్వం కుప్పకూలింది అంటూ వ్యాఖ్యానించారు. 'అవును రాజకీయాల్లో, క్రికెట్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. అందులో బీజేపీ క్లీన్ బౌల్డ్ (Clean Bowled) అయ్యింది' అంటూ గడ్కరీకి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
క్రికెట్ గురించి మీరు (గడ్కరీ) మాట్లాడారు. కానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కి చైర్మన్ గా వ్యవహరించారు. అది మరిచిపోయినట్టున్నారు అంటూ చురకలంటించారు.
50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్, ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కూడా తన దైన స్టైల్లో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే చేజారిందనుకున్న అధికారాన్ని తన చాణక్యంతో శరద్ పవార్ బీజేపీ చేతుల్లోంచి లాక్కొని ఆ పార్టీని క్లీన్ బౌల్డ్ చేశారనే నేపథ్యంలో నవాబ్ మాలిక్ ఇలా కౌంటర్ ఇచ్చారు.