Satara, October 20: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. పార్టీలన్నీ హోరా హోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి, ఎన్‌సీపీ పార్టీలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించకోవాలని కసిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంలో అడ్డంకులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లారు. ఇందులో భాగంగానే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ జోరు వానలో సైతం ప్రచారం నిర్వహించారు. తనలో చేవ తగ్గలేదని జోరు వానలోనూ ఆయన సతారాలో చేసిన ర్యాలీ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఆయనపై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.
సతారాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ పార్టీ అభ్యర్థి ఎంపికలో తప్పు చేసినట్లు అంగీకరించారు.‘తప్పు చేస్తే ఒప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఎంపికలో తప్పు చేశా. ఆ విషయాన్ని మీ ముందు అంగీకరిస్తున్నా. కానీ, ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
ఓ వైపు ఉరుములు, మరోవైపు మెరుపులు ఇంకో వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు అవేమి లెక్క చేయకుండా పవార్ ప్రసంగాన్ని విన్నారు. 21న జరగనున్న పోలింగ్ కోసం సతారా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సతారాలో ఎన్సీపీ చరిత్ర ’సృష్టిస్తుందని పేర్కొన్నారు.
జోరు వానలో పవార్ ప్రసంగం
#WATCH Nationalist Congress Party (NCP) President Sharad Pawar addresses a public rally in Satara, even as it rains. #Maharashtra pic.twitter.com/W63jsRaLuR
— ANI (@ANI) October 18, 2019
ఈ ఎన్నికల్లో ఎన్‌సీపీకి వరుణ దేవుడి ఆశీస్సులు కూడా లభించాయి. వరుణుడి కటాక్షంతో సతారా ప్రజలు అద్భుతం సృష్టించబోతున్నారు’అని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మిగతా నేతలంతా వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆయన ఆగలేదు. తడుస్తూనే ప్రసంగం కొనసాగించారు. పోరాట యోధుడు కాబట్టే శరద్ పవార్ 5 దశాబ్దాలుగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కాగా, సతారా ఉప ఎన్నికకుగాను ఛత్రపతి శివాజీ వంశీకుడు ఉదయన్ భోసాలేకు ఎన్‌సీపీ టికెట్ కేటాయించింది. ఆయన అనంతరం బీజేపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాగా ఈ నెల 21న మహారాష్ట్ర, హరియానాలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మహారాష్ట్రలో ఈ సారి కాంగ్రెస్ ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి.