Parliament Winter Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం, ఇవే చివరి సమావేశాలు. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, ఆర్థిక మందగమనంపై నిలదీయనున్న ప్రతిపక్షం
PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, November 18: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. లోక్ సభను స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా, రాజ్యసభను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ ఏడాదికి ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. లోకసభ సమావేశాలు ప్రారంభమవ్వగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక ఇటీవల మృతి చెందిన అరుణ్ జైట్లీ, జగన్నాథ్ మిశ్రా, రామ్ జెఠ్మలానీ, గురుదాస్ గురుదాస్ గుప్తా, ఎస్ లిబ్రా లాంటి ప్రముఖులకు రాజ్యసభ సంతాపం తెలిపింది.

కీలక బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది, ఏ విషయాలపైనైనా ఎలాంటి దాపరికం లేకుండా చర్చించుకుందామని సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోది (Narendra Modi) పునరుద్ఘాటించారు.

సభకు 35 కీలక బిల్లులు, ఎలాంటి డిబేట్ అయినా ప్రభుత్వం సిద్ధం: ప్రధాని మోదీ

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విషయాలపై కూలంకషంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కోరారు. "సభలో నాణ్యమైన డిబేట్లు జరగడం చాలా ముఖ్యం, సంభాషణలు మరియు చర్చలు జరగాలి." అని మోదీ వ్యాఖ్యానించారు. అందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహకరించి సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ చివరి పార్లమెంట్ సమావేశాలు అసాధారణమైనవని మోదీ పేర్కొన్నారు.

PM Modi's Interaction With Reporters:

 

ఇక ఈ సమావేశాలలో మొత్తం 35 బిల్లులు చర్చకు రానున్నాయి. అందులో చిట్ ఫండ్స్ (సవరణ) బిల్లు, 2019, పౌరసత్వం (సవరణ) బిల్లు 2019, మరియు రాజ్యాంగ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సవరణ) బిల్లు 2019, లాంటి కీలక బిల్లులను ఈ సెషన్‌లో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తుంది. అలాగే, పార్లమెంటు మొదటి సెషన్‌లో ట్రిపుల్ తలాక్ మరియు యుఎపిఎ చట్టానికి జరిమానా విధించే చట్టాన్ని రూపొందించడం సహా ముఖ్యమైన బిల్లులపై సభలో చర్చలు జరగనున్నాయి.

మరోవైపు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు మరియు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు కత్తులు నూరుతున్నాయి.