Bhopal, March 24: బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా (Madhya Pardesh CM) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అంతకుముందు భోపాల్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌహాన్ 'మామాజీ' గా పాపులర్, పార్టీలో అందరూ ఆయనను ఆత్మీయంగా మామాజీ (మామ గారు) అని పిలుస్తారు.
చౌహాన్ గతంలో 2005లో ఒకసారి, 2008లో ఒకసారి మరియు 2013లో ఒకసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత 2018 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి దూరం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ మళ్ళీ 15 నెలల కాలంలోనే 'అనూహ్య పరిణామాల' నేపథ్యంలో చౌహాన్ మళ్లీ సీఎం కాగలిగారు. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్, కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా
సీఎం పదవిని ఆశించి భంగపడి, అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన మద్ధతుదారులు 22 మంది ఎమ్మెల్యేలు సీఎం కమల్ నాథ్ కు తమ మద్ధతును ఉపసంహరించుకున్నారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. రెబెల్ ఎమ్మెల్యేలంతా తమ నేత సింధియా బాటలోనే బీజేపీలో చేరారు. ఆ రకంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం పదవి మళ్ళీ వరించింది.
ఇక సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత COVID-19 వ్యాప్తిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించడమే తన మొదటి ప్రాధాన్యత అని చౌహాన్ అన్నారు. "పార్టీ కార్యకర్తలు ప్రమాణ స్వీకార వేడుకలను జరుపుకోవద్దని మరియు వీధుల్లోకి రాకూడదని" ఆయన కోరారు. ఇంట్లో ఉండి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కోసం ప్రార్థించాలని ఆయన వారికి సూచించారు.