Bengaluru, May 18: కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ మాత్రమే ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.
కాంగ్రెస్ నిర్ణయంతో సిద్ధరామయ్య కర్నాటక సీఎంగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఈనెల 20 మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు విపక్ష నేతలందరినీ ఆహ్వానిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
మరోవైపు గురువారం సాయంత్రం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను లాంఛనంగా సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఇక పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా సిద్ధరామయ్య తొలి రెండేండ్లు సీఎం పదవిలో కొనసాగనుండగా చివరి మూడేండ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపడతారని సమాచారం.
డిప్యూటీ సీఎంతో పాటు తాను కోరుకున్న వారికి రెండు, మూడు కీలక శాఖలు కట్టబెట్టేందుకు హైకమాండ్ సమ్మతించడంతో ఒప్పందానికి డీకే అంగీకరించినట్టు సమాచారం. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది. కర్నాటకలో పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. డీకే, సిద్ధరామయ్యలతో కలిసి ఫొటోలకు ఫోజు ఇస్తూ పార్టీ ఐక్యంగా ఉందనే సంకేతాలు పంపారు.
ఇక ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్ 224 స్ధానాలకు గాను 135 స్ధానాల్లో గెలుపొందింది. బీజేపీ కేవలం 66 స్ధానాలకే పరిమితం కాగా జేడీఎస్ 19 స్దానాలతో సరిపెట్టుకుంది.