CM KCR Meets Sharad Pawar: సరికొత్త ఎజెండాతో ముందుకు వస్తాం: కేసీఆర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తో సుధీర్ఘంగా చర్చ, కేసీఆర్‌ తో కలిసి పనిచేస్తానన్న పవార్, త్వరలోనే అన్ని పార్టీల నేతలతో సమావేశం

Mumbai, Feb 20 : దేశం దశ, దిశను మార్చేందుకు తాను ప్రయత్నిస్తున్నాన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) తో సమావేశమైన ఆయన...పలు కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో పాలన సరైన రీతిలో జరగడం లేదని, కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు కేసీఆర్. ఇక తెలంగాణ (Telangana) పోరాటాన్ని శరద్ పవార్ (Sharad Pawar) ఎప్పుడూ సమర్థించారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఎంతో సహాయం చేశారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. భావసౌరుప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

త్వరలోనే మరికొందరు నేతలతో సమావేశమై చర్చించనున్నట్లు, అందరం చర్చించి ఒక అజెండా రూపొందించుకుని ముందుకెళుతామన్నారు. త్వరలోనే అందరి నేతలతో సమావేశం జరుపుతామన్నారు. అందర్నీ కలుపుకుని పని మొదలు పెడుతామని అయితే.. వీరందరితో మాట్లాడానికి కొంత సమయం పట్టవచ్చని, ఒక ఎజెండా, కార్యాచరణను దేశం ఎదుట ప్రకటిస్తామన్నారు సీఎం కేసీఆర్.

CM KCR Mumbai Tour Highlights: సీఎం కేసీఆర్ ముంబై పర్యటన విజయవంతం, జాతీయ స్థాయిలో అందర్నీ ఏకం చేస్తామని ప్రకటన, దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చల కోసం ప్రముఖులతో భేటీ

మరోవైపు రైతుల సంక్షేమం విషయంలో దేశానికే తెలంగాణ మార్గం చూపించిందని ప్రశంసించారు శరద్ పవార్. అభివృద్ధి ఎజెండాగా తమ భేటీ జరిగిందని, త్వరలోనే మిగిలిన నేతలంతా కలిసి భేటీ అవుతామన్నారు పవార్. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణను చర్చించడం కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర బాట పట్టారు. ఆయన వెంట మహారాష్ట్రకు వెళ్లిన వారిలో ఎంపీలు కేకే, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ కవిత ఇతరులున్నారు.