Karimpur, November 25: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరీంపూర్, ఖరగ్పూర్ సదర్ మరియు కలియగంజ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఉపఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, కరీంపూర్ (Karimpur) స్థానానికి బీజేపీ తరఫున పోటీచేస్తున్న రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు జాయ్ ప్రకాశ్ ముజుందార్ (Joy Prakash Majumdar) పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్తలు దాడి చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ బూత్ కు వచ్చిన ప్రకాశ్ ముజుందార్ ను టీఎంసీ కార్యకర్తలు చితకబాదారు. చెట్ల పొదల్లోకి ఆయనను తోసేసీ కాలితో తన్నుతూ 'గో బ్యాక్' అంటూ బూతులు తిట్టారు. అప్రమత్తమైన పోలీసు బలగాలు కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ముజుందార్ ను కారులో అక్కడ్నించి పంపించివేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ముజుందార్ పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.
BJP Candidate Joy Prakash Majumdar Heckled by TMC Workers:
#WATCH West Bengal BJP Vice President and candidate for Karimpur bypoll, Joy Prakash Majumdar manhandled and kicked allegedly by TMC workers as voting is underway in the constituency. #WestBengal pic.twitter.com/Vpb5s14M5A
— ANI (@ANI) November 25, 2019
ఈ దాడి పట్ల బీజేపీ నేతలు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. 50 మంది టీఎంసీ రౌడీలు తమ అభ్యర్థిని చుట్టుముట్టి చితకబాదారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సరైన భద్రత ఇవ్వలేదని పేర్కొంటూ, తక్షణ చర్యగా జిల్లా ఎస్పీ మరియు అదనపు ఎస్పీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టి, పోలింగ్ కేంద్రం వద్ద అవకతవకలు పాల్పడటానికే ముజుందార్ వచ్చాడంటూ టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఖరగ్పూర్ సదర్ మరియు కలియగంజ్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా గెలవడంతో ఈ రెండు నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. ఇక కరీంపూర్ ఎమ్మెల్యే ఈ ఏడాది 31న మరణించడంతో, ఈ 3 నియోజకవర్గాలకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.