Kyiv, April 17: యుక్రెయిన్‌పై (Ukraine) దాడులను తీవ్రతరం చేసింది రష్యా. కీవ్ (Kyiv) నగరం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఆ నగరంలో సాయుధ వాహనాలు తయారు చేసే కర్మాగారం భవనాలను, మైకొలైవ్‌లో సైనిక వాహనాల మరమ్మతుల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. కీవ్‌తో (Kyiv) పాటు లివివ్ నగరంపై వాయుసేన విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఖార్కివ్, లుహాన్స్క్, దొనెట్స్క్ సహా తూర్పు ప్రాంతాలపై ఫిరంగుల మోత మోగింది. తమ యుద్ధనౌకకు నష్టం కలిగినందుకు మరింత ప్రతీకారంతో దాడుల స్థాయి పెంచింది. ఇది ఇలా ఉంటే.. యుక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం జారీ చేసింది. మరియుపోల్‌లో (Mariupol) ఉన్న యుక్రెయిన్ (Ukraine) సైనికులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని రష్యా చెప్పింది. లొంగిపోయిన సైనికులను ప్రాణాలతో వదిలేస్తామంది. జెనీవా (genava) ఒప్పందం ప్రకారం లొంగిపోయిన సైనికులను యుద్ధ ఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని నిన్న రాత్రి నుంచి ప్రతి అరగంటకు ఒకసారి యుక్రెయిన్ సేనలకు చెబుతోంది రష్యా.
Rahul Gandhi: కరోనా మృతులు 5 లక్షలు కాదు, 40 లక్షలు, కరోనా మృతులపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం మరియుపోల్‌లో లక్ష మంది మిగిలి ఉన్నారు. ఈ నగరంలో అత్యధిక ప్రాంతం రష్యా (Russia) ఆధీనంలోనే ఉంది. ఈ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా అల్టిమేటం విడుదల అయింది. ఇప్పటికే రష్యా దళాలు ఈ నగరంపై పట్టు సాధించాయి. చాలా చిన్న ప్రాంతాల్లోనే యుక్రెయిన్ మద్దతుదారులు ఉన్నారు.
కాగా, యుక్రెయిన్ పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలను తీసుకెళ్తున్న ఓ విమానాన్ని తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పసిగట్టి కూల్చేసిందని రష్యా రక్షణశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కన్సెన్‌కోవ్ తెలిపారు. గత 24 గంటల్లో రష్యా వాయుసేన డజన్ల కొద్దీ యుక్రెయిన్ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన మరియుపోల్‌లో ఇప్పటివరకు 10వేల మంది మరణించినట్లు సమాచారం.
యుక్రెయిన్ సేనల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో రష్యా జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో తమపై రష్యా అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందని, ప్రపంచ దేశాలన్నీ దీనికి సిద్ధంగా ఉండాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్ ప్రజల ప్రాణాలంటే పుతిన్‌కు లెక్కలేదని, అందుకే రసాయన ఆయుధాలనైనా తమపై ప్రయోగించే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌ను సులభంగా చేజిక్కించుకోవచ్చనే తప్పుడు అంచనాల్లో శత్రువులు ఉన్నారన్న జెలెన్ స్కీ.. అదంత సులభం కాదన్నారు. తమ దేశం ఎప్పటికీ రష్యా చేతికి చిక్కదని స్పష్టం చేశారు. రష్యాపై మరింతగా ఆంక్షల కొరడా ఝళిపించాలని, అక్కడి నుంచి ఇంధన దిగుమతులను పూర్తిగా నిషేధించాలని ప్రపంచాన్ని కోరారు జెలెన్ స్కీ