
New Delhi, April 20: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన దేశవ్యాప్త లాక్డౌన్ ఆదివారం నాటికి 26 రోజులు పూర్తిచేసుకుంది. కాగా, ఏప్రిల్ 20 అంటే ఈరోజు నుంచి కొన్ని ఎంపిక చేసిన రంగాలకు కేంద్రం కొన్ని షరతులతో కూడిన సడలింపులను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ హాట్‌స్పాట్‌లు లేని ఏ రాష్ట్రం లేదా జిల్లాలోనైనా ఈరోజు నుండి వాణిజ్య సేవలు, ఆరోగ్య సేవలు, ఆర్థిక మరియు వ్యవసాయ సేవలు, సరుకు రవాణా చేసే వాహనాల రాకపోకలు మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి. అయితే హాట్‌స్పాట్‌లుగా గుర్తించబడిన ప్రాంతాలలో లేదా కంటైన్మెంట్ జోన్‌లలో ఈ సడలింపులు వర్తించబడవు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా లాక్డౌన్ యధావిధిగా మే 3 వరకు కొనసాగుతుంది.
ఏప్రిల్ 20 నుండి సడలింపులు వర్తించబడే రంగాలు
- అత్యవసర వైద్య సేవలు మరియు నిత్యావసరాల కోసం ప్రైవేట్ వాహనాలు తిరిగేందుకు అనుమతి ఉంటుంది. 4-వీలర్ అయితే, డ్రైవర్‌తో పాటు వెనుక సీట్లో ఒక ప్రయాణికుడికి అనుమతించబడుతుంది. 2-వీలర్ విషయంలో రైడర్‌కు మాత్రమే అనుమతించబడుతుంది.
- జాతీయ ఉపాధి హామీ పనులు, నీటిపారుదల మరియు , నీటి సంరక్షణ రంగాలకు అనుమతి. కార్మికులు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. రాష్ట్రం లోపల వలస కూలీలు తరలివెళ్లడానికి అనుమతి, రాష్ట్రం దాటడానికి అనుమతి లేదు.
రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, మునిసిపాలిటీలలో నిర్మాణ ప్రాజెక్టులతో సహా నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి.
- ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, టెలి మెడిసిన్ సౌకర్యాలు, మెడికల్ షాపులు, డిస్పెన్సరీలు పనిచేస్తాయి. తయారీ యూనిట్లు, వైద్య పరికరాలు మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణం యధావిధిగా పనిచేస్తాయి.
ఐటి మరియు ఐటి సంబంధిత సేవలకు, 50% సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి.
- వైద్య పరిశోధనలు, COVID-19 సంబంధిత ప్రయోగశాలలు మరియు సేకరణ కేంద్రాలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థలకు పనిచేసేందుకు అనుమతి. పశువైద్యశాలలు, డిస్పెన్సరీలు, క్లినిక్‌లు, వ్యాక్సిన్ అమ్మకం మరియు సరఫరా, మందులు తెరిచి ఉంటాయి.
- విమాన, రైలు, రోడ్డు మరియు సముద్ర మార్గాల ద్వారా సరుకు రవాణాకు రాష్ట్రం లోపల, రాష్ట్రం వెలుపల ప్రయాణించేందుకు అనుమతి.
- వ్యవసాయ మండీలు, ప్రత్యక్ష మార్కెటింగ్ కార్యకలాపాలు, కోత మరియు విత్తనాలు తెరవబడతాయి. వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు.
- బ్యాంకులు, ఎటిఎంలు, ఫినాన్స్ సంస్థలు తదితర ఆర్థిక సంబంధమైన కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు అనుమతి.
- సామాజిక భద్రతా పెన్షన్లు, ఇపిఎఫ్‌ఓ, అంగన్‌వాడీల నిర్వహణకు అనుమతి.
- చమురు మరియు గ్యాస్ రంగం యొక్క కార్యకలాపాలు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సిఎన్జి, ఎల్పిజి, పిఎన్జి వంటి ఉత్పత్తుల నిల్వ మరియు రిటైల్ పనిచేస్తాయి. తపాలా సేవలు, తపాలా కార్యాలయాలతో సహా పనిచేయడానికి అనుమతించబడతాయి.
లాక్డౌన్ సడలింపులు వర్తించని రంగాలు
- మే 3 రెండో దశ లాక్డౌన్ ముగిసే వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు, రోడ్డు రవాణావ్యవస్థ మరియు దేశీయ / అంతర్జాతీయ విమానాలు నిలిపివేయబడతాయి. ఇది అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థకు (ప్రైవేట్ మరియు పబ్లిక్ క్యాబ్‌లు, బస్సులు, మెట్రో సేవలు) వర్తిస్తుంది.
- అన్ని బహిరంగ ప్రదేశాలు (జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్సులు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు) కూడా మే 3 వరకు మూసివేయబడతాయి.
- కంటెమెంట్ జోన్లు లేదా హాట్‌స్పాట్‌లలోని వ్యక్తులకు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడదు. ఆహారం మరియు ఇతర నిత్యావసరాలు వారి ఇంటివద్దకే పంపిణీ చేయబడతాయి.
- అన్నిరకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మొదలైనవి మూసివేయబడతాయి. అయితే ఆన్‌లైన్ బోధన అనుమతించబడుతుంది.
భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,553 కరోనావైరస్ పాజిటివ్ కేసులు, 36 మరణాలు నమోదయ్యాయి. దేశంలో సోమవారం ఉదయం నాటికి కోవిడ్ -19 కేసుల సంఖ్య 17,265 కు పెరిగింది. మరణాల సంఖ్య కూడా 543 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.