Politicians Criminal Records: రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరితను బయటపెట్టాల్సిందే, వారిని ఎందుకు ఎంపిక చేశారో కారణాలను పార్టీ వెబ్‌సైట్లలో పొందుపర్చాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు
Supreme Court of India | Photo-IANS)

New Delhi, February 13: ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల క్రైమ్ రికార్డులను (Candidates Criminal Cases) రాజకీయ పార్టీలు బహిరంగపర్చాలని సుప్రీంకోర్ట్ (Supreme Court) గురువారం అల్టిమేటం జారీ చేసింది. అంతేకాకుండా, క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ వారిని అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారో తగిన కారాణాలు కూడా వెల్లడించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్ట్ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ వెబ్‌సైట్లలో మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అభ్యర్థుల వివరాలు మరియు అభ్యర్థులకు సంబంధించిన క్రిమినల్ రికార్డులను అప్‌లోడ్ చేయాలి. అలాగే నేరచరిత్ర ఉన్నటు వంటి అభ్యర్థుల ఎంపిక పట్ల కారణాలు, వారికి సంబంధించి వార్త కథనాలు, వారి విజయానికి సంబంధించిన కారణాలు వెల్లడించాలి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదు- కేంద్ర ఎన్నికల కమిషన్

రాజకీయాలను నేరమయం చేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణ జరిపిన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్ట్ రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను ఎన్నికల కమిషన్ కు సమర్పించాలంటూ 2018, సెప్టెంబర్ 25న ఏక్రగ్రీవ తీర్పును వెలువరించింది. అలాగే నేరచరిత్ర గల అభ్యర్థులను మీడియా ద్వారా విస్తృత ప్రచారం కూడా కల్పించాలని అప్పట్లోనే పేర్కొంది.

అయితే ఈ తీర్పును రాజకీయ పార్టీలు విస్మరించాయని పేర్కొంటూ సీనియర్ అడ్వొకేట్ అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కోర్టు తీర్పు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం తదనుగుణంగా రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయ పార్టీలు ఈ ఉత్తర్వులను పాటించడంలో విఫలమైతే అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యతలను సుప్రీంకోర్ట్, ఎన్నికల కమిషన్ కు అప్పగించింది. ఒకవేళ రాజకీయ పార్టీలు ఈ ఉత్తర్వులను పాటించకపోతే, సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కోర్టు సూచించింది.