EVM vs Ballot: ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదు, మళ్ళీ బ్యాలెట్ పత్రాలను తీసుకువచ్చే ఉద్దేశ్యమూ లేదు. స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్
CEC Sunil Arora on EVMs | Photo: PTI

New Delhi, February 12: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్స్ (EVMs) ను ట్యాంపరింగ్ చేయడం వీలు కాదని, అలాగే మళ్ళీ బ్యాలెట్ పత్రాల (Ballot Papers) ద్వారా ఎన్నికలు (Elections) నిర్వహించే ప్రశ్నే అసలు ఉత్పన్నం కాదని కేంద్ర ఎన్నికల కమీషన్ ముఖ్య అధికారి సునీల్ అరోరా (Sunil Arora) తేల్చి చెప్పారు.  ఒక కారులో లేదా యంత్రంలో కొన్నిసార్లు ఎలా అయితే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయో, ఈవీఎంలలో కూడా కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. అంతేగానీ వాటిని ట్యాంపరింగ్ చేయలేమని పేర్కొన్నారు.

దాదాపు 20 ఏళ్ల నుంచి ఈవీఎంలు వినియోగంలో ఉన్నాయి, తిరిగి బ్యాలెట్ పత్రాల వైపు వెనక్కి మళ్లే ప్రసక్తే లేదని సునీల్ అరోరా పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్ట్ సహా అనేక కోర్టులు ఈవీఎంల ప్రామాణికతను సమర్థించాయని అరోరా గుర్తుచేశారు.

రాబోయే రోజుల్లో ఎన్నికల సంస్కరణలు మరియు మోడల్ కోడ్ పై వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ (Election Commission) చర్చలు జరుపుతుందని ఆయన తెలియజేశారు. వైసీపికి 151 సీట్లు అనేవి కాలమో, ఈవీఎంల ఘనతో తెలియదు. - పవన్ కళ్యాణ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీ నేతలు చేసుకునే విమర్శలు- ప్రతివిమర్శలు రోజురోజుకూ అసభ్యంగా, అమర్యాదపూర్వకంగా తయారవుతున్నాయని పేర్కొన్న అరోరా, వాటిని కూడా కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటంపై అడిగిన ప్రశ్నకు సునీల్ అరోరా మాట్లాడుతూ "రాజకీయ కోణంలో తీసుకోబడిన నిర్ణయం మేరకే ఎన్నికల సంఘం దానిని అమలు పరుస్తుంది. ఒకసారి ఎన్నికలకు వెళ్లాలని వారు నిశ్చయించుకున్నప్పుడు, సమర్థంగా ఎన్నికలు నిర్వహించడమే తమ విధి" అని ఆయన బదులు చెప్పారు.

ఎన్నికల కమీషన్ ప్రతినిధులు మరియు ఐఐటీ మద్రాస్ సంయుక్తంగా "బ్లాక్ చైన్" (Block Chain) వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల కమీషనర్, ఇది అమలులోకి వస్తే ఒక ప్రాంతంలో ఓటు కలిగి, వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓటరుకు తాము ఉన్న చోటు నుంచే ఓటు వేసే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. అయితే వారి ఇంటి నుంచే నేరుగా ఓటు వేయొచ్చు అని చెప్పడం లేదని, అందుకు ఎన్నికల సంఘం సమీప ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అంతకంటే ముందుగా ఈ విధానాన్ని అమలు చేయాలంటే అందుకు తగినట్లుగా చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని సునీల్ అరోరా స్పష్టం చేశారు.