New Delhi, JAN 06: చలిని తట్టుకునేందుకు కొందరు వ్యక్తులు కదులుతున్న రైలులో చలి మంట వేశారు. (Bonfire On Train) జనరల్ బోగిలోని ప్రయాణికుల్లో కొందరు ఆ మంట వద్ద చలి కాచుకున్నారు. అయితే రైల్వే గేట్‌ను క్రాస్ చేస్తుండగా రైలులో మంటలు, పొగలను గేట్‌మ్యాన్ చూశాడు. వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళ చలిని తట్టుకోలేక మంటను రాజేశారు. ఆ ఇద్దరితోపాటు ఆ బోగిలోని మరి కొందరు కూడా ఆ మంట వద్ద చలి కాచుకున్నారు.
కాగా, బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న గేట్‌మ్యాన్ ఆ రైలులో మంటలు, పొగలు చూశాడు. వెంటనే రైల్వే అధికారులను అలెర్ట్ చేశాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. తర్వాత రైల్వే స్టేషన్ చమ్రౌలాలో ఆ రైలును నిలిపి అందులోకి ఎక్కారు. రైలు కదులుతుండగా అన్ని బోగీలను తనిఖీ చేశారు. చివరకు జనరల్ బోగిలో పిడకలతో చలి మంట వేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ మంటను ఆర్పివేశారు.
మరోవైపు ఆ రైలు అలీగఢ్ జంక్షన్ చేరిన వెంటనే జనరల్ బోగిలోని 16 మంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రైలు చలి మంట ఎవరు వేశారన్నదానిపై ఆరా తీశారు. ఈ పని తాము చేసినట్లు ఫరీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల చందన్, 23 ఏళ్ల దేవేంద్ర ఒప్పుకున్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది ప్రయాణికులను హెచ్చరించి వదిలేశారు.