Police lathi-charged the flood victims Who protesting on the road (Photo-X)

Vjy, Sep 24: బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు లాఠీచార్జి చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్‌ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్‌ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులను ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలి బుడమేరు వరదకు భవానీపురం కరకట్ట ప్రాంతం మునిగిపోయింది. అయినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. వరద బాధితులకు పరిహారమిచ్చేందుకు ఎన్యూమరేషన్‌ కూడా చేయడంలేదు. అదేమంటే ఈ ప్రాంతం రెడ్‌ జోన్‌లో లేదని అధికారులు చెబుతున్నారు.

వీడియోలు ఇవిగో, విజయవాడలో బుడమేరు వాగు ఉగ్రరూపం, ప్రవాహ తీవ్రత దెబ్బకు వెనక్కి ప్రవహిస్తున్న నది, తీవ్ర భయాందోళనలో ప్రజలు

15 రోజుల క్రితం ఈ బాధితులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేయగా తహసిల్దార్‌ వారికి రేషన్‌ మాత్రం అందించారు. ఎన్యూమరేషన్‌ చేయించలేదు. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. సోమవారం సాయంత్రం దాదాపు 500 మంది బాధితులు విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

Here's Videos

వెస్ట్‌ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వ­రరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వచ్చారు. వెంటనే పోలీసులు రెచ్చిపోయి బాధితులపై లాఠీచార్జ్‌ చేశారు.

అయినా బాధితులు వెరవకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోప్‌ పార్టీ వచ్చి వారిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించినా బాధితులు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. పశ్చిమ తహసిల్దార్‌ను పిలిపించి మాట్లాడిస్తానని ఏడీసీపీ రామకృష్ణ బాధితులకు చెప్పి రోడ్డు మీదున్న వారందరినీ ఒక పక్కకు మళ్లించారు. చివరకు వెస్ట్‌ తహసిల్దార్‌ ఇంతియాజ్‌ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు.

కలెక్టర్‌కు విషయం తెలిసి తనను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్‌ చేయిస్తానని చెప్పారు. రేషన్‌ కార్డ్‌ తదితర ధృవపత్రాలను తీసుకురావల్సి ఉంటుందని చెప్పారు. ఇళ్లన్నీ మునిగిపోతే అవన్నీ ఎక్కడ నుంచి వస్తాయని బాధితులు ప్రశ్నించారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు.