Alluri Sitarama Raju: 27 ఏళ్ళ వయసులో విప్లవ జ్వాలలు, అల్లూరి సీతారామరాజు జీవితం ఎందరికో ఆదర్శనీయం, మన్యం వీరుడి పోరాటాన్ని గురించి ఓ సారి గుర్తు చేసుకుందాం
Alluri Sitarama Raju (Photo-Twitter)

భారత స్వాతంత్ర్య చరిత్రలో (1897 జూలై 4 - 1924 మే 7) ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు (Alluri Sitarama Raju) జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు అమాయకులు, విద్యా విహీనులైన కొండ జాతి ప్రజ లను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు.

సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజపరచి, వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ ఘోష్, అల్లూరి సీతారామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు. నేడు సీతారామరాజు 125వ జయంతి. ఈ సందర్భంగా (Alluri Sitarama Raju 125th birth anniversary) ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి నేడు ఆవిష్కరిస్తున్నారు.

భీమవరానికి ప్రధాని మోదీ, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్న భారత ప్రధాని, అనంతరం పెదమీరంలో భారీ బహిరంగ సభ

పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు గ్రామ వాస్తవ్యులు అల్లూరి వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ మొదటి సంతానంగా 1897 జూలై 4వ తేదీన రాజు జన్మించారు. ఈయన అసలుపేరు శ్రీరామరాజు. ఆయన తండ్రి రాజమండ్రిలో ఫొటోగ్రాఫర్‌గా స్థిర పడ్డారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు జరుగుతున్న సమ యంలో 1908లో ఆయన కలరా వ్యాధితో మరణించాడు. అప్పటి నుంచి సీతారామరాజు తాసీల్దారైన పినతండ్రి రామకృష్ణంరాజు సంరక్షణలో పెరిగాడు.

బ్రిటీష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవాగ్నిని రగిలించిన సీతారామరాజు.. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తొలిసారి దాడి చేశారు. ఆ తర్వాత 23న క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడిచేశారు. ఈ మూడు స్టేషన్లపై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని.. స్వాతంత్ర్య పోరాటం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరుసపెట్టి.. పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు అల్లూరి. ఈ విప్లవాన్ని ఎలాగైనా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం.. మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలా మంది అల్లూరి అనుచరులను పొట్టనబెట్టుకుంది.

రెండేళ్ల పాటు బ్రిటిషర్లకు కంటిమీద కనుకు లేకుండా చేసిన అల్లూరి.. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను పెడుతున్న కష్టాలను చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖ జిల్లా మంప గ్రామానికి సమీపాన.. అల్లూరి స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోయిన బ్రిటిష్ అధికారులు.. ఆయన్ని చింతచెట్టుకు కట్టి కాల్చిచంపారు. సీతారామరాజు కలలుగన్న స్వాతంత్య్రం.. ఆయన ఆత్మత్యాగం చేసిన 28 ఏళ్లకు.. భారత ప్రజలకు లభించింది. స్వంతంత్ర భారతావని జయకేతనంగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయారు.

సీతారామరాజు అంటే వ్యక్తి కాదు సమూహ శక్తి. సంగ్రామ భేరి. స్వాతంత్ర్య నినాదం.. సమరగీతం.. ఉద్యమ జ్వాల.1917లో విశాఖ జిల్లా క్రిష్ణదేవీపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టారు. అక్కడ.. అడవి బిడ్డల దీన స్థితులు, అవస్థలు పరిశీలించి,తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడలేదు సీతారామరాజు.1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు.. పెరిగింది మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి.. సంస్కృతం, జోతిష్యం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారు.

రామరాజు తండ్రి వెంకట రామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. సీతారామరాజు ప్రధాన అనుచరుడు, సేనాని గాం గంటందొర. ఈయనది నడింపాలెం గ్రామం. గంటందొర, మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరతీశారు. మే 8న రాజు అనుచరులు ఆయన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరిపారు. భీమవరంలో ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహాన్ని దాదాపు రూ.3 కోట్ల ఖర్చుతో 15 టన్నుల బరువుతో నిర్మించారు. పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో దీన్ని తయారు చేయించారు. ఈ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంది. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్‌ దిమ్మెపై నిలబెట్టారు.