Eid Milad Un Nabi: మిలాద్ ఉన్ నబీ చరిత్ర ఏమిటి? ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, మీలాదె నబి పండుగ గురించి ప్రత్యేక కథనం
Milad-un-Nabi Image used for representational purpose (Photo Credits: Pixabay)

మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను (Eid Milad Un Nabi) జరుపుకుంటారు.

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను (Prophet Muhammad) ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మించిన కారణంగా.. ఆయన జ్ణాపకార్థం ఈద్-ఎ-మిలాద్-ఉన్ పండుగను (Milad un-Nab) జరుపుకుంటారు.ఆయన సౌదీ అరేబియాలోని మక్కాలో క్రీ. శ. 570లో జన్మించి క్రీ. శ.632 వరకు జీవించి అదే రోజున(తేదీన) కాలధర్మం చేశారు. ముస్లింల చాంద్ర మాన క్యాలండర్ ప్రకారం ఈద్ మిలాద్-ఉన్-నబీ వారి రబీవుల్ అవ్వల్ మాసంలో జరుపుకుంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ చివరి ప్రవక్త.మిలాద్-ఉన్-నబీ అనే పండుగను మావ్లిద్ అన్-నబీ పండుగ అని కూడా పిలుస్తారు.

మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు, అలాగే మరణించిన రోజే ఈద్ మిలాద్-ఉన్-నబి, మానవులందరికీ ప్రేమ, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేసిన ప్రవక్త

ఈ పండుగ రోజున ప్రార్థనలు, ఖురాన్ పఠనం, మసీదుల్లో ప్రసంగాలు వంటివి వారు జరుపుకుంటారు. అయితే ఈ పండుగ విషయంలో ముస్లింలలో రెండు తెగలవారు అంటే, సున్నీలు, షియాలు వేర్వేరు భావాలు కలిగి ఉన్నారు. ఆకుపచ్చని రిబ్బన్లు, జెండాలు, బ్యానర్లు వంటివి ఈ రోజున ముస్లింలు ప్రదర్శిస్తారు. మసీదులు, ఇతర కమ్యూనిటీ భవనాల్లో అన్నదానం, రాత్రుల్లో సైతం మసీదుల్లో ప్రార్థనలు జరుపుతారు. ముస్లింలలోని చాలా తెగలవారు ప్రవక్త పుట్టిన రోజును ఓ పర్వదినంగా భావించరు. ముస్లింలలోని సలాఫీ, వహబీ సిద్ధాంతాలున్నవారు ఈ రోజును పర్వదినంగా ఆచరించరు.