Hyderabad, September 12: పదిరోజుల పాటు పూజలందుకున్న వినాయకుడిని తల్లి గంగమ్మ ఒడికి మనసారా సాగనంపుతున్నారు. ఈ ఏడాది వెళ్లి, వచ్చే ఏడాది ఇంతే వైభవంగా తిరిగిరావయ్య గణపయ్య అంటూ నిమజ్జనం (Ganesh Immersion) చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంది. హైదరాబాదులో వినాయక నిమజ్జన శోభయాత్ర (Ganesh Shobha Yatra) ఎప్పట్లాగే అశేష భక్తజన కోలాహలంతో, జై బోలో గణేశ్ మహరాజ్ కీ అనే జయజయధ్వానాల మధ్య కన్నుల పండుగగా కొనసాగుతుంది. సుమారు 50 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనానికి తరలుతుండటంతో నగరంలోని దారులన్నీ శోభాయమనంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు ట్రాఫిక్ ఆంక్షలను తెలుసుకొని తమ ప్రయాణాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.
విజయవాడ నుంచి వచ్చే వారికి ఎల్బీనగర్ వరకు, బెంగళూరు, చెన్నె నుంచి వచ్చే ఆరాంఘర్ వరకు లేదా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కొండాపూర్ వరకు మరియు నాగపూర్ -ఆదిలాబాద్, నిర్మల్ నుంచి వచ్చేవారిని జూబ్లీ బస్ స్టేషన్ వరకు మాత్రమే అనుమతిస్తారు. బీదర్- సంగారెడ్డి నుంచి వచ్చేవారికి కూకట్ పల్లి వరకు అనుమతిస్తున్నారు, వీలుంటే ఖైరతాబాద్ వరకూ అనుమతిస్తారు.
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నగరంలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుంది. ఎలాంటి దాడులకు సంబంధించి సమాచారం లేదు, కాబట్టి ఎలాంటి పుకార్లు నమ్మకుండా నిమజ్జనోత్సవాల్లో పాల్గొనవచ్చునని డీజీపీ మహేంధర్ రెడ్డి తెలిపారు.
పూర్తైన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం.
ఈ ఏడాది ద్వాదశ ముఖ లంబోదరుడిగా కొలువుతీరిన ప్రఖ్యాత ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తైంది. మధ్యాహ్నం 1:40 సమయంలో నెక్లెస్ రోడ్ లోని క్రేన్ నెంబర్ 6 నుంచి 50 టన్నుల బరువున్న ఈ భారీ గణనాథుడి నిమజ్జనాన్ని పూర్తిచేశారు. ఉదయం ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన బడా గణేశ్ శోభయాత్ర 7గంటల పాటు కొనసాగింది.
రికార్డ్ ధరకు బాలాపూర్ లడ్డు.
ప్రఖ్యాత బాలాపూర్ గణేశ్ లడ్డు ప్రసాదం వేలంలో రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ. 1 లక్ష ఎక్కువకు, ఈ ఏడాది రూ. 17.60 లక్షలకు కొలను రామిరెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. 21 కిలోలు ఉన్న ఈ లడ్డూను వెండిపల్లెంలో పెట్టి వేలం పాట విజేతకు అందించారు.