Hyderabad Numaish 2020: జనవరి 1 నుంచి హైదరాబాద్ నుమాయిష్, కొలువుదీరనున్న 2వేల స్టాల్స్ , అగ్ని ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు
Image used for representational purpose only| File Photo

Hyderabad, December 30: అఖిల భారత పారిశ్రామిక వార్షిక ప్రదర్శన (All India Industrial Exhibition), 80వ నుమాయిష్-2020 ( Numaish 2020) జనవరి 1 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎగ్జిబిషన్ సొసైటీ (Hyderabad Exhibition Society) పకడ్బందీగా చేస్తుంది. గతేడాది జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేంధర్ (Etela Rajender) తెలిపారు. స్టాళ్లలో గ్యాస్, కిరోసిన్ స్టవ్‌ల ఉపయోగం మరియు స్మోకింగ్ పూర్తిగా నిషేధించామని పేర్కొన్నారు. ఆదాయం తక్కువ వచ్చినా, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు, దుకాణాలు మరియు మెరుగైన వసతులు ఏర్పాటుచేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఈసారి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబులింగ్‌ను ఏర్పాటు చేశామని, అలాగే సుశిక్షుతులైన 40 మంది అగ్నిమాపక సిబ్బందిని 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. నగర పౌరులకు నుమాయిష్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా నుమాయిష్ 2020ను విజయవంతం చేయాలని ఈటెల పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చిన ఆదాయంతో ఇప్పటివరకు 30 వేల మందికి విద్యను అందించినట్లు వెల్లడించారు.

జనవరి 1, 2020నుంచి ఫిబ్రవరి 15, 2020 వరకు నుమాయిష్ జరగనుంది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు, కార్పోరేట్ మరియు మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ కు సంబంధించి దాదాపు 2000 వేరకు స్టాళ్లు కొలువుదీరనున్నట్లు సమాచారం.

అత్యంత ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నుమాయిష్ కు ప్రతీ ఏడాది కనీసం 20 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని నుమాయిష్ జరిగే రోజుల్లో నాంపల్లి వైపు ప్రతీరోజు రాత్రి 11:30 వరకు అదనపు సర్వీసులు నడుపుతామని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది.