Independence Day 2021: భారత స్వాతంత్య్ర దినోత్సవం, మువ్వన్నెల జెండా గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిన ముఖ్య విషయాలు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ మీకోసం
Happy Independence Day (File Image)

బ్రిటిష్ వారి రాక్షసపాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2021) జరుపుకుంటూ వస్తున్నాం. మహానీయులను గుర్తు చేసుకుంటున్నాం.

జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది.

భారత జాతీయ జెండాను 1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదించగా, ఆ తరువాత నుంచి అదే జెండాను మనం ఉపయోగిస్తూ వస్తున్నాం. భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. కాగా భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య. ఆయన రూపొందించిన జెండానే ఇప్పటికీ మనం వాడుతున్నాం. ఇక మన జాతీయ పతాకానికి సంబంధించి పలు నియమ నిబంధనలను మనం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఢిల్లీలో హైఅలర్ట్, నిఘా నీడలో ప్రధాని మోదీ ప్రసంగించే ఎర్రకోట, పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఢిల్లీ పోలీసులు

కేవలం ఖాదీ, కాట్‌, సిల్క్ వస్త్రంతో మాత్రమే భారత జాతీయ జెండాను తయారు చేయాల్సి ఉంటుంది. జెండా పొడవు, వెడల్పుల నిష్పత్తి కచ్చితంగా 3:2 లో ఉండాలి. మన జాతీయ జెండాను 6300 x 4200 మిల్లీ మీటర్ల నుండి 150 x 100 మి.మీ. వరకు మొత్తం 9 రకాల సైజ్‌లలో తయారు చేసుకోవచ్చు.

జాతీయ జెండాను ఎగురవేసినప్పుడు అది నిటారుగా ఉండేలా చూడాలి. కిందకు వంచకూడదు. వంగితే సరిచేయాలి. అంతేకానీ తప్పుగా జెండాను ఎగురవేయకూడదు. అలాగే మన జాతీయ జెండాను ఎప్పుడూ తలదించుకున్నట్లుగా కాక తల ఎత్తుకున్నట్లుగా ఎగురవేయాలి. ప్లాస్టిక్‌ను జెండా తయారీకి వాడకూడదు. కాకపోతే కాగితంతో జెండాలను తయారు చేసుకోవచ్చు. అది కూడా చిన్న సైజ్ జెండాలే అయిఉండాలి.

కాషాయం, తెలుపు, ఆకుపచ్చ పై నుంచి కిందకు వచ్చేలా జెండాను ఎగురవేయాలి. అలాగే ఆ రంగులు సమాన కొలతల్లో ఉండాలి. జెండాలో మధ్యలో ఉండే తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం 24 ఆకులను కలిగి ఉండాలి. అది నీలం రంగులో ఉండాలి. జాతీయ జెండాను ఎప్పుడూ సూర్యుడు ఉదయించాకే ఎగురవేయాలి. అలాగే సూర్యుడు అస్తమించకముందే జెండాను దించాలి. జాతీయ జెండాను నేలమీద పెట్టకూడదు. నీటిలో వేయకూడదు. జెండాపై ఎలాంటి రాతలు రాయరాదు. అక్షరాలు కూడా ప్రింట్ చేయరాదు.

ఆగ‌స్టు 14వ తేదీ ఇకనుంచి విభజన గాయాల స్మారక దినం, భయానక విభజన గాయాలు గుర్తు చేసుకునే రోజుగా ఈ తేదీని జరుపుకోవాలని ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రధాని నరేంద్రమోదీ

ఇతర జెండాలతో జాతీయ జెండాను ఎగుర వేయాల్సి వస్తే జాతీయ జెండా మిగతా జెండాల కన్నా కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ప్రదర్శనల్లో జాతీయ జెండా మిగిలిన జెండాల కన్నా కొంచెం ముందుగానే ఉండేలా చూసుకోవాలి.

మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య బయోగ్రఫీ

మన మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన తెలుగువాడు.. మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు. పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు. కానీ, పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31, ఏప్రిల్ 1 వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఈ పతకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం వచ్చి చేరింది.

ఏప్రిల్‌ 13, 1936 నాటి ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో గాంధీజీ పింగళి వెంకయ్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 50 ఏళ్ల పాటు అది కొనసాగింది. వెంకయ్య సన్నిహితులు ఆయన్ను జపన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, జనద వెంకయ్య అని పలు రకాలుగా పిలుచుకునేవారు.

వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.

బెజవాడ వేదికగా 1921లో అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ.. వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు, మధ్య రాట్నం గల ఒక జెండాను రూపొందించాలని కోరారు. మహాత్ముడు సూచనలతో ఒక జెండాను వెంకయ్య రూపొదించగా.. సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడ్డారు. దీంతో వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.

గాంధీజీ అండతో త్రివర్ణపతాకం బెజవాడలోనే పుట్టింది. కాషాయం హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేస్తుందన్నారు. కార్మిక, కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్య హింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.