Jaya Ekadashi 2024 | File Photo

Jaya Ekadashi 2024: సనాతన ధర్మంలో ఏకాదశి తిథులు ఆనాడు ఆచరించే ఉపవాసం, పూజలు మరియు ఇతర కార్యాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఒక సంవత్సరంలో మొత్తం 12 ఏకాదశిలు ఉంటాయి. అందులో జయ ఏకాదశి కూడా ఒకటి. అయితే మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశిని జయ ఏకాదశి అంటారు. ఈ జయ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో వ్రతం, పూజలను ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయి, వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ జయ ఏకాదశికి భీష్మ ఏకాదశి అనే పేరు కూడా ప్రసిద్ధి. జయ ఏకాదశి రోజునే భీష్మ పితామహుడు అంపశయ్యపై అస్తమించి నారాయణుడిలో ఏకమయ్యాడని మహాభారత గ్రంథాలలో ఉంది. అందుకే జయ ఏకాదశి రోజు అనేది హిందువులకు ఎంతో పవిత్రమైనది.

2024లో జయ ఏకాదశి ఎప్పుడు? తేదీ, తిథి, పూజా ముహుర్తం వివరాలు

2024లో జయ ఏకాదశి తేదీ ఫిబ్రవరి 20న, మంగళవారం నాడు వస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి ఫిబ్రవరి 19న ఉదయం 08:49 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే, మరుసటి రోజు ఫిబ్రవరి 20 ఉదయం 09:55 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయతిథికి ప్రాముఖ్యత ఉంది, ఏకాదశిని ద్వాదశితో విడుస్తారు కాబట్టి ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం నాడు ఏకాదశి ఉపవాసం పాటించబడుతుంది.

ఏకాదశి తిథి ప్రారంభం - ఫిబ్రవరి 19, 2024 - 08:49 AM

ఏకాదశి తిథి ముగింపు - ఫిబ్రవరి 20, 2024 - 09:55 AM

పారణ సమయం - ఫిబ్రవరి 21, 2024 - 06:13 AM నుండి 08:32 AM వరకు

పారణ రోజున ద్వాదశి ముగింపు క్షణం - ఫిబ్రవరి 21, 2024 - 11:27 AM

జయ ఏకాదశి ప్రాముఖ్యత

పురాణాలలో మాఘమాసం చాలా పవిత్రమైనదిగా చెప్పబడింది. ఈ మాసంలో ఆచరించే నదీ స్నానాలు, చేసే దానధర్మాలు, ఉపవాసాల ఫలితాలు అమోఘంగా ఉంటాయని చెబుతారు. మాఘమాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని 'జయ ఏకాదశి' అంటారు. ఈ ఏకాదశి చాలా శుభప్రదమైనది, శక్తివంతమైనది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనిషి నీచ జీవితం నుండి విముక్తి పొందుతాడు.

పద్మ పురాణం ప్రకారం, మహా విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ భగవానుడు జయ ఏకాదశి వ్రతం గురించి పాండురాజైన ధర్మరాజుకు స్వయంగా వివరించాడు. ప్రతి జీవి చేసే పాపకర్మలు, గత జన్మల కర్మ ఫలాలు, బాధల నుంచి బయటపడటానికి జయ ఏకాదశి గొప్పది అని పేర్కొన్నాడు. జయ ఏకాదశ వ్రతాన్ని నిష్టతో ఆచరించడం ద్వారా భయంకర పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది. బ్రహ్మహత్య వంటి పాపాలు, భూత, ప్రేత, పిశాచాల పీడన నుంచి విముక్తుడవుతాడు, నరకలోక బాధలు తొలగి వైకుంఠ ధామ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడింది.

జయ ఏకాదశి రోజున, మహా విష్ణువును మరియు విష్ణువు "ఉపేంద్ర" రూపాన్ని పూజిస్తారు. ఉదయాన్నే లేచి స్నానమాచరించి, పరిశుభ్ర వస్తాలతో, పరిశుద్ధమైన మనసుతో మహా విష్ణువు సహస్ర నామాలను జపిస్తూ పూజ చేయాలి, భక్తితో లక్ష్మీ నారాయణులను ఆరాధించాలి. ఉపవాసం ఉండాలి, సాత్విక ఆహారమే స్వీకరించాలి. దానధర్మాలు చేయాలి.

జపించాల్సిన మంత్రాలు

ఓం నమో భగవతే వాసుదేవయే..!!

శ్రీ కృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవాయ..!!

అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామ నారాయణం జానకీ వల్లభం..!!

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తతుల్యం రామ నామ వరాననే..!!