Vishwakarma Puja 2024: విశ్వకర్మను విశ్వం యొక్క దైవిక వాస్తుశిల్పిగా పరిగణిస్తారు. విశ్వకర్మ అనేది రెండు పదాల కలయిక, ఇందులో విశ్వ అంటే అనంత విశ్వం మరియు కర్మ అంటే ప్రతి సృష్టికి కారకుడు. అంటే విశ్వంలో ఉద్భవించే ప్రతి అద్భుత సృష్టికి మూలం విశ్వకర్మనే. పురాణాల ప్రకారం, ఆయన సృష్టికర్త బ్రహ్మకు వారసుడు, బ్రహ్మ దేవుని ఏడవ కుమారుడు. దైవికమైన సృజనాత్మక కలిగిన విశ్వకర్మ అనేక అద్భుతమైన నిర్మాణాలు, ఆయుధాలను రూపొందించాడు. దేవతలు నివసించే స్వర్గం, శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారాకా రాజ్యం, పాండవుల కోసం ఇంద్రప్రస్థ, రావణుడి లంక వరకు ప్రతీ నిర్మాణ రూపకర్త విశ్వకర్మనే. శివుని త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం వంటి ఆయుధాలను సైతం రూపొందించింది విశ్వకర్మనేనని పురాణాలు చెబుతున్నాయి. యాంత్రిక శాస్త్రం, వాస్తుశిల్ప శాస్త్రాలుగా చెప్పే స్థపత్య వేదాన్ని కూడా విశ్వకర్మ రచించినట్లు కథనాలు ఉన్నాయి. అందుకే విశ్వకర్మను దైవంగా కొలుస్తారు, ఆయన జయంతి రోజున పూజలు చేస్తారు.
విశ్వకర్మ జయంతి ఎప్పుడు?
ప్రపంచానికి అసలైన సృష్టికర్తగా పిలువబడుతున్న విశ్వకర్మ జయంతికి హిందూమతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ వేడుక తేదీలో మార్పు ఉంటుంది. ఎందుకంటే ఇదే విశ్మకర్మ యొక్క అసలైన పుట్టిన తేదీ అని నిర్ధారించలేము. విశ్వకర్మ జయంతి యొక్క మూలాన్ని ప్రాచీన భారతీయ గ్రంథాల నుండి గుర్తించవచ్చు. విశ్వకర్మ జయంతి గురించిన ప్రస్తావన పురాతన హిందూ గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదంలో ఉంది. విశ్వకర్మ మాఘ మాస శుక్లపక్ష త్రయోదశి నాడు జన్మించాడని పేర్కొనబడింది. ఈ ప్రకారంగా, హిందూ క్యాలెండర్ ప్రకారం 2024లో మాఘ మాస శుక్లపక్ష త్రయోదశి ఫిబ్రవరి 22న, గురువారం రోజున వస్తుంది. కనుక మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలలో మాఘ మాస శుక్లపక్ష త్రయోదశి నాడే విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు.
విశ్వకర్మ పూజ ప్రాముఖ్యత
విశ్వకర్మ జయంతి పండుగను ప్రధానంగా హస్తకళాకారులు, పారిశ్రామిక కార్మికులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు తదితర వర్గాల వారు వైభవంగా జరుపుకుంటారు. తమని తాము విశ్వకర్మ వారసులుగా భావిస్తారు. తమకు సంబంధించిన రంగాలలో మంచి పురోభివృద్ధి సాధించాలని విశ్వకర్మను కోరుకుంటారు. తమ చేతి ద్వారా అద్భుతమైన కళాఖండాలు, నిర్మాణాలకు రూపకల్పన చేసే శక్తిని ప్రసాదించాలని ఆయన అనుగ్రహం కోసం పూజలు చేస్తారు.
కమ్మరి కుమ్మరి వృత్తుల వారు, వడ్రంగులు, వాస్తుశిల్పులు, శిల్పులు, ఫ్యాక్టరీ కార్మికులు, కర్మాగార యజమానులు తదితరులు ఈరోజున తమ పనిముట్లను, యంత్రాలను మొదలైన వాటిని విశ్వకర్మ చిత్రపటం ముందు ఉంచి పూజలు చేస్తారు, వివిధ ఆచారాలను పాటిస్తారు. విశ్వకర్మ పూజ ద్వారా కళాకారులు, వ్యాపారవేత్తలు తమ వృత్తిలో విజయం, శ్రేయస్సు, భద్రత కోసం ప్రార్థిస్తారు. ఈ పూజ సమాజంలోని వివిధ చేతి వృత్తుల వారిని ఏకతాటిపైకి తీసుకురావడానికి, వారి ఐక్యతను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.
వ్యాపార రంగంలో విశ్వకర్మ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి విశ్వకర్మ జయంతి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రారంభించే పని విజయవంతం అవుతుందని నమ్ముతారు.