
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 2025 ఆదివారం రాత్రి సంభవించనుంది. భాద్రపద మాసం పౌర్ణమి రోజున జరిగే ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:57 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. రాత్రి 11:01 నుండి తెల్లవారుజామున 1:26 వరకు కొనసాగుతుంది. మొత్తం 3 గంటల 29 నిమిషాలు కనిపించనున్న ఈ గ్రహణం యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా తూర్పు ప్రాంతాలలో దర్శనమిస్తుంది. ఈసారి చంద్రుడు కుంభరాశిలో పూర్వాభాద్రపద నక్షత్రంలో ఉండగా గ్రహణం సంభవించడం వల్ల ప్రత్యేకంగా భారతదేశం, పాకిస్తాన్‌పై ప్రభావం చూపనుంది.
జ్యోతిష్య లెక్కల ప్రకారం.. స్వతంత్ర భారతదేశ జాతకంలో (15 ఆగస్టు 1947, అర్ధరాత్రి, ఢిల్లీ) వృషభ లగ్నం ఆధారంగా ఈ గ్రహణం పదవ ఇంటిపై ప్రభావం చూపుతోంది. ఇది రాజసత్తా అంటే కేంద్ర ప్రభుత్వంపై దెబ్బతీసే అవకాశాన్ని సూచిస్తుంది. రాబోయే ఆరు నెలల్లో కేంద్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్యులు భావిస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి స్థిరత్వం సమస్య తలెత్తవచ్చని జ్యోతిష శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
చంద్ర రాశి కర్కాటక నుంచి ఎనిమిదో రాశి కుంభరాశిలో ఈ గ్రహణం సంభవించడం వలన భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయాలు, హిందూకుష్ పర్వత ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవచ్చనే భయం వ్యక్తమవుతోంది. బృహత్ సంహితలో పేర్కొన్నట్లుగా, కుంభరాశిలో గ్రహణం సంభవిస్తే పర్వత ప్రాంత ప్రజలకు కష్టాలు తలెత్తుతాయని హెచ్చరిక ఉంది.ఇక మీనరాశిలోని గ్రహస్థితి వల్ల పంజాబ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వరద సమస్యలు మరింత పెరగవచ్చని జ్యోతిష్య సూచనలు చేస్తున్నారు. గ్రహణం జరిగిన మూడు రోజుల్లో వర్షాలు మరింత ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ గ్రహణం భారత్–పాకిస్తాన్ సంబంధాలపై కూడా ప్రభావం చూపనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. భూకంపాలు, వర్షాలు, సరిహద్దు ప్రాంతాలలో కల్లోలాలు రెండు దేశాల ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
గ్రహణానంతరం అమెరికా భారత్‌పై వాణిజ్య ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వజ్రాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, రసాయనాలు, క్రీడా వస్తువులు వంటి భారతీయ ఎగుమతులపై 50 శాతం సుంకం విధించారు. రాబోయే కాలంలో అమెరికా భారత్‌ను వాణిజ్య ఒప్పందాల దిశగా నెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పండ్లు, గింజలు, ఆటోమొబైల్స్, ఆధునిక ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇక భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ జన్మరాశి కుంభంలో ఈ గ్రహణం పడటం విశేషం. పూర్వాభాద్రపద నక్షత్రంలోనే ఆయన జన్మించగా, ఈసారి అదే నక్షత్రంలో గ్రహణం రావడం వలన ఆయనకు రాబోయే ఆరు నెలల్లో వివాదాలు, కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి.