
విబ్రియో వల్నిఫికస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు అమెరికాలో భయాందోళన రేపుతోంది. ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా ధాటికి అమెరికన్లు గజగజ వణుకుతున్నారు. అమెరికాలో తాజాగా రెండు మరణాలు నమోదు కావడంతో ఈ మాంసాన్ని తినే బ్యాక్టీరియా మళ్లీ వార్తల్లోకెక్కింది. లూసియానా తీరప్రాంతంలో పండించిన గుల్లలను (oysters) తిన్న తర్వాత ఈ ఇన్ఫెక్షన్లు బయటపడ్డాయి. ఒక కేసు స్థానిక రెస్టారెంట్‌లో, మరోక కేసు ఫ్లోరిడాలో నమోదైంది. యుఎస్ ఆరోగ్య అధికారులు తెలిపిన ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు 34 కేసులు గుర్తించారు. ఇది గత దశాబ్దంలోనే అత్యధికమని చెప్పుకోవచ్చు.
ఈ పెరుగుదల అమెరికా వ్యాప్తంగా సముద్రంలో లభించే జీవులతో కూడిన ఆహార భద్రతపై ఆందోళనను పెంచింది. ముఖ్యంగా పచ్చి గుల్లలు తినడం వల్ల విబ్రియో వల్నిఫికస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. భోజనం చేసిన 24 గంటల్లోనే ఈ వైరస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. మొదట్లో జ్వరం, వాంతులు, విరేచనాలు, వికారం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వేగంగా ముదిరి, రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్), చర్మంపై నొప్పితో కూడిన బొబ్బలు, ఇంకా కణజాలాన్ని నాశనం చేసే నెక్రోటైజింగ్ ఫాసిటిస్ వరకు దారి తీస్తాయి. వెంటనే చికిత్స అందించకపోతే, రోగి ప్రాణాలకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
విబ్రియో వల్నిఫికస్ అనే ఈ బ్యాక్టీరియా సహజంగానే సముద్రపు ఉప్పునీటిలో పెరుగుతుంది. ముఖ్యంగా గల్ఫ్ తీరం వంటి వెచ్చని నీటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ముడి షెల్ఫిష్ తినడం లేదా గాయాలు ఉన్న వ్యక్తి సముద్ర జలాల్లో తిరగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. కాబట్టి దీన్ని flesh-eating bacteria అని పిలుస్తారు.
కబగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ప్రమాదకరమవుతుంది. కాలేయ వ్యాధులు, మధుమేహం, మూత్రపిండ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ వ్యాధి కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ బ్యాక్టీరియా సాధారణంగా అరుదైనదే అయినప్పటికీ సోకితే ప్రాణాంతకమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది
ముడి లేదా తక్కువగా ఉడికించిన షెల్ఫిష్ తినడం మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఆహారాన్ని వేరు వేరు పాత్రల్లో నిల్వ చేయడం, వంట సమయంలో సరిగా ఉడకబెట్టడం, వంటకు ముందు చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు అవసరమని నొక్కి చెబుతున్నారు. అలాగే గాయాలు ఉన్నవారు సముద్రంలో ఈత కొట్టడం లేదా షెల్ఫిష్‌లను చేతితో తాకడం తప్పించుకోవాలని సూచిస్తున్నారు.
విబ్రియో వల్నిఫికస్ ఇన్ఫెక్షన్ మీకు సోకిందనే అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. డాక్టర్లు సాధారణంగా డాక్సీసైక్లిన్ లేదా సెఫ్టాజిడిమ్ వంటి యాంటీబయాటిక్స్‌ను ఇస్తారు. తీవ్రమైన పరిస్థితుల్లో శస్త్రచికిత్స ద్వారా ఇన్ఫెక్టెడ్ టిష్యూలను తొలగించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో అవయవాలను తొలగించడం కూడా (amputation) తప్పనిసరి అవుతుంది.
ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో.. తాజాగా అమెరికాలో ఆరోగ్య సంస్థలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా వేసవిలో సముద్రపు నీరు వేడెక్కే సమయంలో ఈ బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. అందువల్ల సముద్ర ఆహారాన్ని తినే ముందు సురక్షితంగా వండటం, గాయాలను రక్షించుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పచ్చి గుల్లలు తినకపోవడం అత్యంత అవసరమని హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనా విబ్రియో వల్నిఫికస్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకోవడం, లక్షణాలు కనిపించగానే వైద్య సహాయం పొందడం తప్పనిసరి.