Republic Day 2024: గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతదేశం ముస్తాబైంది. ఈ 2024లో భారత్ 75వ గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో న భూతో న భవిష్యత్ అనిపించేలా అబ్బురపరిచే కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. వేడుకల్లో భారత సైనిక, నావికా, వైమానిక దళాల విన్యాసాలు, పోలీసు, పారామిలిటరీ బృందాల కవాతులు ఆకట్టుకోనున్నాయి. ఈ సారి ఫ్రెంచ్ సైన్యం కూడా కవాతులో పాల్గొనడం ఒక విశేషం ఇవి కాకుండా, ఈసారి వేడుకల్లో మరెన్నో ఆసక్తికర అంశాలు ఉండనున్నాయి, ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
2024 జనవరి 26న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి కర్తవ్య మార్గ్ వరకు జరిగే కవాతుతో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ వేడుకలను సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ముఖ్య అథితి
2024 భారత గణతంత్ర గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన జైపూర్‌లో ల్యాండ్ అయ్యారు. తన పర్యటనలో భాగంగా ఇమ్మాన్యుయేల్ మన దేశంలోని అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్, హవా మహల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించనున్నారు. జైపూర్‌లోనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు, అనంతరం ఇద్దరూ కలిసి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటారు, అనంతరం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ఇచ్చే 'ఎట్ హోమ్' రిసెప్షన్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు పాల్గొంటారు.
మహిళా త్రివిధ దళాల పరేడ్
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొదటి సారి త్రివిధ దళాల నుంచి మహిళల బృందం పాల్గొంటుందని మేజర్ జనరల్ సుమిత్ మెహతా చెప్పారు. ఈ బృందంలో ఆర్మీ సహా ఇతర భద్రతా విభాగాలకు చెందిన మహిళా దళాలు ఉంటారు.
చీరల ప్రదర్శన
చీరకట్టు భారతీయ మహిళకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా 'అనంత సూత్ర' పేరిట ప్రత్యేక చీరల ప్రదర్శన చేయనున్నారు. భారతదేశం నలుమూలల నుండి దాదాపు 1,900 రకాల చీరలు, చీరకట్టులను కార్యక్రమానికి వీచ్చేసిన ప్రేక్షకుల వెనక ప్రదర్శించనున్నారు. ప్రతి చీరకు QR కోడ్‌లు ఉంటాయి, వాటిని స్కాన్ చేయడం ద్వారా ఆ చీరకట్టు ఏ ప్రదేశానికి చెందినది, ఎంబ్రాయిడరీ పద్ధతుల గురించి వివరాలను తెలుసుకోవచ్చు. భారతీయ మహిళలు, చేనేత కార్మికుల గౌరవార్థం సుమారు 150 ఏళ్ల నాటి చీరను ఏర్పాటు చేసినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
పరేడ్‌లో కృత్రిమ మేధ
వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు (AI) పాత్రను నొక్కిచెప్పేందుకు ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేక ప్రదర్శనను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు విద్యను అందించడానికి ఉపాధ్యాయులు VR హెడ్‌సెట్‌ని ఉపయోగించే దృశ్యాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.
చంద్రయాన్3 వెలుగులు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సాధించిన విజయాలు, చంద్రయాన్ 3 ఘనత ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రత్యేక వెలుగులు విరజిమ్మనుంది. చంద్రుని దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ప్రదర్శించనున్నారు.