New Delhi, Jan 26: భారత్ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. మరికొద్దిసేపట్లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్నారు. అనంతరం సైనిక వందనం స్వీకరిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
రిపబ్లిక్ డే (Republic Day 2021) సందర్భంగా ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేస్తూ దేశ ప్రజలను పలకరించారు. కొవిడ్-19 మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండా తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగించేందుకు సిద్ధమయ్యాయి.ఈసారి కోవిడ్ 19 నేపథ్యంలో రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో (Republic Day Parade 2021) ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశాలు చాలానే ఉన్నాయి.
మొట్టమొదటిసారిగా అత్యాధునిక రాఫెల్ యుద్ద విమానాలు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ నుంచి వీటిని ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత అమ్ములపొదిలో ఉన్న 8 రాఫెల్ యుద్ద విమానాలు రిపబ్లిక్ డే వైమానిక విన్యాసాల్లో పాల్గొననున్నాయి. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తరుపున ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ కూడా పాల్గొనున్నారు. ఇందులో పాల్గొనున్న తొలి మహిళా ఫైటర్ పైలట్ భావనా కాంతే కావడం విశేషం.
కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లదాక్ నుంచి తొలిసారిగా ఓ శకటం రిపబ్లిక్ డే పరేడ్‌లో కనువిందు చేయనుంది. లదాక్ చారిత్రక థిక్సే బౌద్ధ మఠాన్ని ఈ శకటంలో చూపించబోతున్నారు. దాంతోపాటూ లదాక్ సంస్కృతి, సంప్రదాయాలు కూడా ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ తరుపున లేపాక్షి ఆలయాన్ని ప్రతిబింబించే శకటం రిపబ్లిక్ డే వేడుకల్లో సందడి చేయనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి నంది విగ్రహంతో విజయనగరరాజుల కాలంలో లేపాక్షి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
ఆలయ అద్భుత నిర్మాణశైలి, ముఖ మంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటప నమూనాను శకటం ద్వారా ప్రదర్శించనున్నారు. రాతితో చెక్కిన పెద్ద వినాయకుడు, ఏడు శిరస్సుల నాగేంద్రుని ప్రతిమ శకటంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్‌ను తమ శకటం ద్వారా ప్రదర్శించనుంది. అలాగే 1971లో భారత్-పాక్ యుద్ధం సందర్భంగా చేపట్టిన ఆపరేషన్స్‌ను ప్రదర్శించనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరుపున రామ మందిర నిర్మాణానికి సంబంధించిన శకటం పరేడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.