
Solar Eclipse 2024: ఖగోళంలో జరిగే అనేక దృగ్వియాలకు సైన్స్ పరంగానే కాకుండా మతపరంగా కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణం వంటివి సంభవిస్తున్నప్పుడు ముఖ్యంగా భారతదేశంలో గ్రహణ ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం పరంగా అంచనాలు వేస్తారు. అందుకు తగినట్లుగా తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. హిందూ పంచాంగంలో ఈ గ్రహణాలకు, గ్రహాల కదలికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కాగా, ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8, సోమవారం రోజున ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని చెబుతున్నారు.
సూర్య గ్రహణం అంటే ఏమిటి?
సూర్యగ్రహణం (Solar Eclipse) అనేది సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. భూమికి, సూర్యుని మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు భూమిపై ఉన్నవారికి సూర్యుని కాంతి అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఖగోళ సంఘటననే సూర్యగ్రహణం అని పిలుస్తారు. సూర్యకాంతికి చంద్రుడు అడ్డుగా వచ్చే భాగం ఆధారంగా అది పాక్షిక సూర్య గ్రహణమా లేక సంపూర్ణ సూర్యగ్రహణమా అనేది నిర్ణయిస్తారు. చంద్రుడు సూర్యుడు మధ్యగా వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది, ఈ సందర్భంలో కొన్ని నిమిషాల పాటు 'రింగ్ ఆఫ్ ఫైర్' కనిపిస్తుంది.
2024 సంవత్సరంలో మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఎందుకు ప్రత్యేకమైనది, అది ఎక్కడ కనిపించబోతుందో తెలుసుకుందాం.
2024 సూర్యగ్రహణం ప్రత్యేకత
ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం పలు అంశాలలో ప్రత్యేకంగా ఉండబోతోంది. గత ఏడు సంవత్సరాలలో ఈ తరహా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం ఇది రెండవసారి మాత్రమే. అయితే, ఈసారి గ్రహణం సమయంలో సూర్యుడు గరిష్టమైన ప్రకాశంలో ఉంటాడు. ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో 'రింగ్ ఆఫ్ ఫైర్' పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది.
2024 సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది
నాసా ప్రకారం, 2024లో ఏప్రిల్ 8న ఏర్పడబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా అంతటా కనిపిస్తుంది. ఇది మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఉదయం 11:07 గంటలకు మొదటిసారిగా కనిపిస్తుంది. ఆ తర్వాత అమెరికా, కెనడా దేశాల్లోని ప్రజలు పగటిపూట సూర్యాస్తమయాన్ని చూడగలుగుతారు. అమెరికాలోని 13 రాష్ట్రాల్లో ఇది కనిపించబోతోంది. ఈ దేశాల్లోని లక్షలాది మంది ప్రజలు ఈ అద్భుతమైన ఖగోళ సంఘటనకు సాక్షులుగా ఉంటారు.
అయితే, ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ సమయంలో సూర్యగ్రహణం యొక్క సూతక కాల ప్రభావం వర్తించదు లేదా ఎలాంటి ప్రాముఖ్యతను కలిగి ఉండదు అని పలువురు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా, సూతక కాలం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో పూజలు, శుభకార్యాలు నిషిద్ధం.