Valentine Week 2024 (File Image)

Valentine Week 2024 : క్యాలెండర్ లో ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలా మంది యువత 'ప్రేమికుల రోజు' వేడుకలను ఎలా జరుపుకోవాలనే దానిపై దృష్టిపెడతారు. తాము ప్రేమించే వ్యక్తులకు తమ ప్రేమను వివిధ రూపాలలో వ్యక్తపరచటానికి వాలైంటైన్స్ డేను ఒక అవకాశంగా భావిస్తారు. తమ మదిలోని భావాలను మధురంగా చెప్పేందుకు ఆరాటపడతారు, ప్రేమికుడు లేదా ప్రేయసితో కలిసి రోజుకో వేడుక చేసుకోవాలని ఊహాలోకంలో విహరిస్తారు, అందమైన కలలు కంటారు.

ఫిబ్రవరి నెల ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రేమికుల వారం కోసం ప్రేమ పక్షులు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. ప్రపంచంలో ప్రతిమూలలో ఉండే ప్రేమ జంటలు తమదైన శైలిలో వేడుకలు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రేమికుల వారంగా చెప్తారు. ఈవారం రోజుల్లో ప్రతీరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ వారంలోని ప్రతీరోజూ విభిన్నమైన రీతిలో ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఇస్తుంది. పరిమళభరితమైన గులాబీ పువ్వులను అందించడం దగ్గర్నించీ, వెచ్చని కౌగిలిలో బంధించడం వరకు మీ ప్రేమను చూపేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ప్రేమికుల వారం ఎప్పట్నించి మొదలవుతుంది, ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికుల వారంలోని ఏడు రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి ఏడు రోజులను ప్రేమికుల వారంగా చెప్తారు. ఈ క్రమంలో ఏ రోజును ఏ పేరుతో పిలుస్తారు అనేది ఈ కింద చూడండి.

2024లో ప్రేమికుల వారం జాబితా ఇదిగో..

07 ఫిబ్రవరి 2024 (బుధవారం) రోజ్ డే

రోజ్ డే సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను బహుమతిగా ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు.

08 ఫిబ్రవరి 2024 (గురువారం) ప్రపోజ్ డే

ఈ రోజున ప్రేమికులు తమ ప్రేమను తెలియజేయడం చేయడం ద్వారా తమ వైఖరిని చాటుతారు.

09 ఫిబ్రవరి 2024 (శుక్రవారం) చాక్లెట్ డే

ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం మరింత మధురంగా సాగాలని ఈరోజు ప్రేమ జంటలు ఒకరికొకరు చాక్లెట్లను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు.

10 ఫిబ్రవరి 2024 (శనివారం) టెడ్డీ డే

ఈరోజున ప్రేమికులు ఒకరికొకరు టెడ్డీని బహుమతిగా ఇస్తారు, ఇది బంధం మధ్య విశ్వసనీయతను, వెచ్చదనాన్ని చాటుతుంది.

11 ఫిబ్రవరి 2024 (ఆదివారం) ప్రామిస్ డే

ఈరోజు చాలా ముఖ్యమైనది, ఇద్దరూ జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ఉంటారని వాగ్దానం చేస్తారు.

12 ఫిబ్రవరి 2024 (సోమవారం) హగ్ డే

ప్రేమను అంగీకరించిన తర్వాత, ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు.

13 ఫిబ్రవరి 2024 (మంగళవారం) కిస్ డే

ఈ రోజున ప్రేమికులు ఒకరినొకరు ముద్దాడుకుంటారు. ఇది బంధాన్ని మరింత పెనవేసుకునేలా తోడ్పడుతుంది.

14 ఫిబ్రవరి 2024 (బుధవారం) వాలెంటైన్స్ డే

ప్రేమికుల వారంలో ఇది చివరి రోజు. ఇదే ప్రేమికుల రోజుగా ప్రాముఖ్యత కలిగి ఉంది. తమ ప్రేమ బంధం పదిలం చేసుకొని ఒకరితోఒకరి కలిసి జీవించాలని కోరుకునే రోజు. చాలా మంది ప్రేమ జంటలు ఇదే రోజున తమ ప్రేమను మరోసారి గొప్పగా వ్యక్తపరుచుకుంటారు. రోజంతా కలిసి సమయం గడుపుతారు, పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ ప్రత్యేకమైన తేదీని ఎంచుకుంటారు.

వాలెంటైన్ డే ప్రాముఖ్యత:

వాలెంటైన్స్ డే అనేది ప్రేమికుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను చాటేందుకు జరుపుకునే ఒక వేడుక. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అవకాశం ఇచ్చే ఒక సంతోషకరమైన సమయం. ప్రపంచంలో ప్రేమ ఒక్కటే బంధాలను నిలిపి ఉంచే సాధనం అని చాటి చెప్పే సందర్భం.

నిజానికి, ప్రేమికుల రోజుకు పాశ్చాత్య సంస్కృతి మూలాలు ఉన్నప్పటికీ, ఇది సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తం అయింది. విభిన్న సంస్కృతులు ఈ రోజును స్వీకరించాయి, వారి ఆచారాలకు అనుగుణంగా ప్రేమను వ్యక్తీకరించే విధానానికి ప్రత్యేకమైన హంగులను చేర్చుకుంటూ వచ్చాయి.

అయితే, సమకాలీన ప్రపంచంలో ఈ ప్రేమికుల రోజుకు కమర్షియల్ హంగులు అద్దుతుండటంతో దీనిని సొమ్ము చేసుకుంటున్నారు, అలాగే సాంస్కృతిక వైరుధ్యం కారణంగా కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రేమ అనేది ఎలాంటి మరకలేని ఒక నిస్వార్థమైన భావోద్వేగం, బంధాలని నిలిపి ఉంచే అస్త్రం అని అంగీకరించాల్సిన విషయం.