Vasanta Panchami 2024: మాఘమాసం శిశిర ఋతువులో వచ్చే శుక్ల పంచమిని వసంత పంచమి అంటారు. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతోనూ పిలుస్తారు. వసంత పంచమి నామాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాల్సి ఉంటుంది. పురాణ గ్రంథాల ప్రకారం రుతువుల రాజు వసంతుడు. కనుక శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు. వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి శోభాయమానంగా విరాజిల్లుతుంది. వసంతం పకృతిలోని జీవులన్నిటికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది.
ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి, దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయని వేదపండితులు చెబుతారు.
Vasanta Panchami 2024 Muhurat- వసంత పంచమి ముహూర్తం
2024లో వసంత పంచమి పర్వదినం తేదీ, శుభ ముహూర్తం సమయాలు ఇలా ఉన్నాయి.
2024లో వసంత పంచమి ఫిబ్రవరి 14న బుధవారం నాడు వస్తుంది.
వసంత పంచమి ముహూర్తం ఉదయం 06:44 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది.
ఈ మొత్తం వ్యవధి 05 గంటలు 47 నిమిషాలు
పంచమి తిథి ప్రారంభం - ఫిబ్రవరి 13, 2024న మధ్యాహ్నం 02:41 సమయానికి ప్రారంభం అవుతుంది.
పంచమి తిథి ముగింపు- ఫిబ్రవరి 14, 2024న మధ్యాహ్నం 12:09 సమయానికి ముగుస్తుంది.
వసంత పంచమి - సరస్వతీ పూజ
వసంత పంచమికి హిందూమతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వసంత పంచమినాడే సరస్వతీ మాత జన్మించిన రోజు అని ఈరోజును విద్యారంభ రోజుగా భావించి అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అక్షరానికి సరస్వతి అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని అయినటువంటి శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశారని, శారద దీక్ష స్వీకరించి వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే నేడు వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. అందుకే వసంత పంచమి రోజున సరస్వతీ పూజ అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
సరస్వతికి వాగేశ్వరీ, వాగ్దేవి, శ్రీవాణి, శారద ఇలా అనేక అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతి.
వసంత పంచమి రోజు సరస్వతి మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వారికి జ్ఞానకటాక్షాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని బలంగా విశ్వసిస్తారు. సరస్వతీ దేవిని పూజించేటపుడు ఈ కింది మంత్రాన్ని జపించాలి.
యా కున్దేన్దుతుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా।
యా వీణావరదణ్డమణ్డితకరా యా శ్వేతపద్మాసనా॥
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైః సదా వన్దితా।
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేషజాడ్యాపహా॥౧॥
శుక్లాం బ్రహ్మవిచార సార పరమామాద్యాం జగద్వ్యాపినీం।
వీణా-పుస్తక-ధారిణీమభయదాం జాడ్యాన్ధకారాపహామ్॥
హస్తే స్ఫటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితామ్।
వన్దే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్॥౨॥
వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి పూజిస్తారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది, సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదా దేవి. శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథి నాడు సరస్వతీ దేవికి ప్రత్యేక ఆరాధనలు, విశేష పూజలు చేస్తారు.