Plant-based diet: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే ఆహారం శరీరంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రోటీన్ అవసరాల కోసం మాంసం, గుడ్లు , చికెన్ వంటి వాటిని తినమని కొన్ని అధ్యయనాలు సిఫార్సు చేస్తాయి, అయితే మాంసం అతిగా తినడం కూడా అనారోగ్యాలకు కారణం అవుతుంది.
వ్యాధులను తట్టుకునే శక్తి శాకాహార పదార్థాలనే లభిస్తుందని వివిధ పరిశోధనలు నిరూపించాయి. ఎక్కువకాలం జీవించాలంటే శాకాహార ఆహారం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అందులోనూ ఎలాంటి ఆహారం తీసుకుంటే గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. తినే ఆహారం వివిధ రకాల పోషకాలు ఉంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు.
ఇటీవల కాలంగా మొక్కల ఆధారిత ఆహారం తినే ధోరణి వేగంగా పెరిగింది. ఇందులో కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మొక్కల నూనెలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు మొదలైనవి ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం అంటే మీరు పూర్తిగా శాకాహారంగా ఉండాలని, మాంసం లేదా పాలను ఎప్పుడూ తినకూడదని కాదు. బదులుగా, మీరు మొక్కల మూలాల ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
మొక్కల ఆధారిత ఆహారం ప్రయోజనాలు
అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం,తినే ఆహారంలో మాంసాహారంతో తక్కువ, మొక్కల ఆధారిత ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి. ఈ రకమైన ఆహారం ఇస్కీమిక్ గుండె జబ్బులు , వాటితో కలిగే మరణాల ముప్పు తగ్గించడంలో సహాయపడుతుంది.
బలమైన రోగనిరోధక వ్యవస్థ
శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడితే అది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆహారంలో మొక్కల ఆధారిత ఆహారాన్ని చేర్చడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొక్కలలో ఉండే విటమిన్లు , ఖనిజాలు, ఫైటోకెమికల్స్ , యాంటీఆక్సిడెంట్లు అనారోగ్య సమయంలో మిమ్మల్ని వేగంగా కోలుకునేలా చేయడంలో సహాయపడతాయి.మొక్కల ఆధారిత ఆహారం మీ శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
పోషకాలు నిండుగా లభిస్తాయి
మాంసాహారంలో హానికర కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి, పోషకాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీ ప్లేట్‌లో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వివిధ రంగుల కూరగాయలు ఉండేలా చూసుకోండి. ఆలివ్ ఆయిల్, గింజలు , అవకాడో వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
మెరుగైన జీర్ణ ఆరోగ్యం
మాంసాహారంతో పోలిస్తే శాకాహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు మాంసం తింటున్నప్పుడు ఎక్కువగా కూరగాయలు తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారంపడదు. ఇలా తినడం వలన మీ జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, ఎలాంటి జీర్ణ సమస్యలు రావు.