Omicron Variant Symptoms: ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం
Coronavirus. Representational Image. (Photo Credits: Pixabay)

Cape Town, Nov 30: ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) గురించి సౌతాఫ్రికా సైంటిస్టులు న‌వంబ‌ర్ 25న ప్ర‌పంచానికి తెలియజేసిన సంగతి విదితమే. డెల్టా కంటే రెండు మూడు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ (Omicron Variant) 15కుపైగా దేశాల్లో వ్యాపించింది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైర‌స్‌ను మొద‌ట‌గా గుర్తించిన సౌత్ ఆఫ్రికా మెడిక‌ల్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు డాక్టర్ ఆంగెలిక్యూ కొయెట్జీ ఈ వేరియంట్‌ గురించి మరింత సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ (Omicron COVID variant) సోకిన 30 మంది వ్యక్తులను ఆమె నిశితంగా పరిశీలించి లక్షణాలను (Omicron Variant Symptoms) అంచనా వేశారు. ఇవి తెలియని లక్షణాలని, అయితే తేలికపాటివి అని ఆమె నిర్ధారించారు. కొత్త వేరియంట్‌ సోకిన వారు ‘విపరీతమైన అలసట’కు గురైనట్లు (unusual but mild symptoms) ఫిర్యాదు చేశారని డాక్టర్‌ కొయెట్జీ తెలిపారు. రోగులకు తేలికపాటి కండరాల నొప్పులు, బొంగుర గొంతు, పొడి దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే కొంతమందికి మాత్రమే కొంచెం ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత (జ్వరం) ఉందన్నారు.

మరోవైపు ఒమిక్రాన్ స్ట్రెయిన్ లక్షణాలు ఇతర కరోనా వేరియంట్‌ కంటే భిన్నంగా ఉన్నాయని డాక్టర్ కొయెట్జీ తెలిపారు. ఇవి మరింత తీవ్రమైన లక్షణాలకు దారి తీయవచ్చని చెప్పారు. ‘తీవ్రమైన వ్యాధి రాదని మేము చెప్పడం లేదు. కానీ ప్రస్తుతానికి, టీకాలు తీసుకోని రోగుల్లో కూడా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి’ అని ఆమె పేర్కొన్నారు. ఐరోపాలో చాలా మంది ప్రజలు ఇప్పటికే ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారిన పడ్డారని డాక్టర్‌ కొయెట్జీ చెప్పారు. ఒమిక్రాన్ దాని వైరుధ్యం గురించి ఇంకా పూర్తిగా తెలియలేదన్నారు. బహుళ ఉత్పరివర్తనాల వల్ల అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా ప్రచారం చేయడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వేరియంట్‌ వల్ల చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం గమనించాల్సిన అంశమన్నారు.

4 రోజుల్లో 12 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్, పెను ప్ర‌మాదం పొంచి ఉందని తెలిపిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, డెల్టా క‌న్నా ఆరు రెట్లు ప్ర‌మాదక‌ర‌మ‌ంటున్న నిపుణులు

ఇప్పటివరకు కరోనా వైరస్‌లో వచ్చిన వేరియంట్లలో అన్నిటికన్నా ఎక్కువగా జన్యు ఉత్పరివర్తనలు జరిగిన వేరియంట్‌ ఒమిక్రాన్‌. కరోనాకి సంబంధించిన వేరియంట్లలో ఉత్పరివర్తనాల విషయంలో ఇది రారాజు లాంటిది. ఇప్పటి వరకు 50కి పైగా కొత్త జన్యు ఉత్పరివర్తనాలు ఈ వేరియంట్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.

అంతేకాకుండా వీటిలో సుమారుగా 32 ఉత్పరివర్తనాలు... ఒక్క దాని స్పైక్‌ ప్రోటీన్‌లోనే ఉండటాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో కూడా ఫ్యూరీన్‌ క్లీవేజ్‌ సైట్‌ అనే భాగంలో మూడు ఉత్పరివర్తనాలు ఉండటం గమనించారు. ఇందువల్ల ఈ వైరస్‌కి యాంటీబాడీస్‌ను బైపాస్‌ చేసుకునే లక్షణం వస్తుందనేది శాస్త్రవేత్తల అంచనా. ఎందుకంటే కరోనా వైరస్‌ మానవ శరీరంలో ప్రవేశించాలంటే దాని స్పైక్‌ ప్రోటీన్‌ను... మన కణజాలంలోకి చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని స్పైక్‌ ప్రోటీన్‌ని శాస్త్రవేత్తలందరూ ఒక టార్గెట్‌ గా భావించారు. యాంటీబాడీస్‌ తయారుచేయడానికీ, వ్యాక్సిన్‌లను రూపొందించడానికీ, మందుల తయారీకీ శాస్త్రవేత్తలు స్పైక్‌ ప్రోటీన్‌ని ఒక లక్ష్యంగా చేసుకున్నారు.

ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు, మళ్లీ మాస్కులు ధరించాలని సూచన

ఎప్పుడైతే స్పైక్‌ ప్రోటీన్లో ఎక్కువగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయో అప్పుడు అనేక రకాలైన మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా కరోనా వైరస్‌ మన శరీర కణాలలోకి చొచ్చుకుపోయే విషయంలో ఇంకా వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టాక అక్కడ అవి ఉత్పత్తి చేసే యాంటీబాడీస్‌ ఈ వైరస్‌ని గుర్తించలేకపోవచ్చు. అలాగే మనం తయారుచేసుకున్న యాంటీవైరల్‌ మందులు ఈ వేరియంట్‌ పైన పని చేయకపోవచ్చు. దీంతో పాటుగా మనం తయారుచేసుకున్న సింథటిక్‌ యాంటీబాడీస్‌ ఈ వైరస్‌ని ప్రభావితం చేయలేకపోవచ్చు. ఈ కారణాలను బట్టి ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌కి కొన్ని ‘సూపర్‌ పవర్స్‌’ ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

మొట్టమొదటగా ఈ వేరియంట్‌ని బోట్స్‌వానా, దక్షిణాఫ్రికాలలో గుర్తించారు. అక్కడ్నుంచి ఇది హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌ కు పాకింది. ఇంకా అనేక దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే విస్తరించి ఉండే అవకాశం లేకపోలేదు. ఈ వైరస్‌ని ముందుగా బి.1.1.529 అని పిలిచారు. డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా గుర్తించగానే దీనికి గ్రీక్‌ ఆల్ఫాబెట్‌ లో 15వ అక్షరమైన ‘ఒమిక్రాన్‌’ అనే పేరు పెట్టారు.