Mumbai, March 05: ఆర్థిక విషయాల్లో మనలో చాలా మంది ‘ఇంకా గడువు ఉందిగా.. అప్పుడు చూద్దాం’ అనేవారే ఎక్కువ. తీరా గడువు ముగిశాక ‘అయ్యో!’ అంటూ నిట్టూరుస్తుంటారు. కొంతమందికి గడువు తేదీపై అవగాహన ఉండదు. కారణమేదైతేనేం డబ్బుకు సంబంధించి వ్యవహారాల్లో అలసత్వం ఏమాత్రం పనికిరాదు. ఇప్పుడు మనం మార్చిలోకి అడుగుపెట్టాం. అంటే ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఉన్నాం. మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి నెలాఖరులోగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి (March Dealine) ఉంటుంది. పాన్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ ఎప్పటి నుంచో చెప్తోంది. వాస్తవానికి దీనికిచ్చిన గడువు ఎప్పుడో ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ చివరి అవకాశం మిగిలే ఉంది. 2023 మార్చి 31లోగా పాన్‌తో ఆధార్‌ను (PAN Link with Aadhar) అనుసంధానం చేసుకోవచ్చు. రూ.1000 జరిమానా చెల్లించి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు దాటితే పాన్ కార్డు నిరుపయోగంగామారిపోతుంది. అదే జరిగితే బ్యాంక్ ఖాతాలు గానీ, డీమ్యాట్ అకౌంట్ గానీ తెరవడానికి సాధ్యపడదు. ఒకవేళ ఇప్పటి వరకు అనుసందానం చేసుకోకుంటే.. ఇప్పుడే చేసుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకూ ఓ సారి గుర్తుచేయండి.
వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన’ (PMVVY) అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికి అండగా ఉండటమే లక్ష్యంగా దీన్నితీసుకొచ్చారు.ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని అందిస్తున్నారు. 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించారు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది. నెలల, మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి పెన్షన్ పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. 10 ఏళ్ల పాటూ ఇదే వడ్డీ అమల్లో ఉంటుంది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ పాత ఆదాయపు పన్ను విధానం ఎంచుకునే వారు మార్చి 31లోపు పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఎలాంటి పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులు పెట్టకపోయి ఉంటే.. జీవిత బీమా పాలసీలు, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, ఎన్‌పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. కొత్త పన్ను విధానం ఎంచుకునే వారికి ఎలాంటి మినహాయింపులూ వర్తించవు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేవారికి నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లింపులకూ గడువు దగ్గర పడింది. మార్చి 15 లోగా ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుంది.