Horrible Tour: ఫైవ్ స్టార్ హోటల్ అని బుక్ చేసుకున్నారు, తీరా వెళ్లి చూస్తే ఊహించని షాక్, హాలిడే ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఫ్యామిలీకి చేదు అనుభవం
Crystal Beach Aqua Park and Hotel : Photo Credits Youtube

London: అప్పుడప్పుడు మనం కొన్ని రియల్ ఎస్టేట్ ప్రకటనలను చూసుంటాం. వారి ప్రకటనల్లో పెద్ద వెంచర్, బిల్డింగ్స్, స్విమ్మింగ్ పూల్, పార్క్ అంటూ గ్రాఫిక్స్ లో ఒక అద్భుత ప్రపంచాన్ని చూపిస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే గానీ వాస్తవ పరిస్థితి ఎంటో తెలీదు. ఇలాంటి ఊహలతో హాలిడేస్ ను ఎంజాయ్ చేద్దామని వెళ్లిన ఒక ఫ్యామిలీకి అక్కడి సీన్ షాక్ ఇచ్చింది. ఇక జన్మలో తెలియని ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లొద్దనే విరక్తిని కలిగించింది.

వివరాల్లోకి వెళ్తే, యూకేకు చెందిన మార్క్ మోల్డ్ (Mark Mould) (33) అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి ఈజిప్టులో రెండు వారాల పాటు హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ట్రావెల్ కంపెనీ లవ్ హాలిడేస్ (LoveHolidays) ద్వారా క్రిస్టల్ బీచ్ ఆక్వా పార్క్ - హోటెల్ (Crystal Beach Aqua Park and Hotel) అనే పేరు గల ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసుకున్నారు. అందుకోసం £3,465 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 3.2 లక్షలు) చెల్లించారు కూడా.

అత్యంత విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్, ఎదురుగా అందమైన బీచ్, మంచి స్విమ్మింగ్ పూల్, వాటర్‌పార్క్‌లు, పబ్ లు, డాన్సింగ్ బార్లు ఒబ్బో ఒకటేమిటి వెబ్ సైట్లో ఎన్నో చూపించారు. ఇక ఎన్నో ఆశలతో ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని ఈజిప్టులో ల్యాండ్ అయి నేరుగా, వారు బుక్ చేసుకున్న హోటెల్ ప్రాంతానికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే వారనుకున్నట్లుగా అలాంటి హోటెల్ ఏమి లేదు. అసలు ఆ హోటెల్ నిర్మాణమే జరగలేదని తెలియడంతో షాక్ తిన్నారు. ఆ ప్రదేశంలో అలాంటి ఒక హోటల్ కట్టబడుతుంది అనేది ఒక ప్రకటన మాత్రమే, కానీ ఇంతవరకు నిర్మాణం జరగలేదు అని తెలిసింది. దీంతో వాళ్ల అందాల ఆశలన్నీ ఒక్కసారిగా నీరుగారిపోయాయి. అసలు ఆ హోటెల్ లేనప్పుడు మాకు బుకింగ్ ఎలా చేస్తారంటూ ట్రావెల్ ఏజెన్సీని నిలదీయడంతో ఆ విషయం మాకు తెలియదని, కేవలం బుకింగ్స్ చేసే బాధ్యత మాత్రమే మాది అని బదులు ఇచ్చారు. అయితే ప్రత్యామ్నాయంగా అప్పటికప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న మరో హోటెల్ లో గదిని ఏర్పాటు చేశారు.

అయితే ఆ హోటెల్లో కూడా రెండు రోజులు నరకం అనుభవించారట మార్క్ ఫామిలీ. చిన్న గది, 5గురికి కలిపి రెండు బెడ్లు కేటాయించారట. అందులో ఏసీ కూడా లేదు, కేవలం ఒక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ తిరిగితే సీలింగ్ ఊడిపడుతుందా అనేలా ఉందట.

ఫుడ్ కూడా యావరేజ్‌గా స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంది. బీర్ ఆర్డర్ ఇస్తే ఏమాత్రం చల్లగా లేకుండా వేడి వేడిగా తీసుకొచ్చారట. స్విమ్మింగ్ పూల్ దుర్గందగా పాకురు కట్టి ఆకుపచ్చ నీళ్లతో ఉందట. ఇక భరించలేక ఆ హోటల్ సిబ్బందిని నిలదీస్తే, ఆ హోటెల్ కూడా కూల్చేస్తున్నామని నామమాత్రంగా ప్రస్తుతానికి నడిపిస్తున్నామని బదులిచ్చారట.

దీంతో ట్రావెల్ ఏజేన్సీని మళ్ళీ సంప్రదిస్తే వేరే హోటెల్‌కు మార్చారు. అయితే అప్పటికప్పుడు ఆ హోటెల్ జాజమాన్యం £8,000 పౌండ్లు (దాదాపు రూ. 7.4 లక్షలు) డిమాండ్ చేశారట. ఇక ఎలాగో అలా ఆరోజు ఖర్చులు భరించి తిరుగు ప్రయాణమయ్యామని మార్క్ మోల్డ్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. లగ్జరీగా గడుపుదామనుకొని ఎన్నో కలలతో టూర్ వెళ్తే, ఆ టూర్ భయాందోళనలతో కూడిన కోపంతో వచ్చిన నమ్మశక్యం కాని నిరాశనిస్పృహల అనుభవాన్ని మిగిల్చిందని బాధపడ్డాడు.